ముంబై : టీవీ షోలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై విధించిన నిరవధిక నిషేధాన్ని క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) గురువారం ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరు మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగే అవకాశం లభించింది. నిషేధం తొలగించడంతో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై భారత అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్, పాండ్యాలపై నిషేధం ఎత్తివేత అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదో చెత్త నిర్ణయమని కొందరంటుంటే.. కాదు కాదు మంచి నిర్ణయమేనని మరికొందరు అంటున్నారు. పాండ్యా లేనప్పుడు భారత జట్టు సమతూకంగా ఉందని, మంచి విజయాలు సాధిస్తుందని ఒకరంటే.. అతనికి మ్యాచ్‌లు గెలిపించే సత్తాలేదని, చెత్త ఆల్‌రౌండరని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక పాండ్యాకు మద్దతు తెలిపేవారేమో.. బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని కితాబిస్తున్నారు. ఇప్పటికే ఈ యువ క్రికెటర్లు ఈ వివాదంతో గుణపాఠం నేర్చుకున్నారని మద్దతు తెలుపుతున్నారు. నిషేధం ఎత్తేయడంతో పాండ్యా న్యూజిలాండ్ బయలు దేరగా.. కేఎల్ రాహుల్ భారత ఏ జట్టు తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌ను ఆడనున్నాడు.
సరదాగా మాట్లాడే క్రమంలో నోరుజారిన రాహుల్, పాండ్యాలను ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఈ నెల మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించిన విషయం తెలిసిందే. తొలుత సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ముందు యువ క్రికెటర్ల కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే, సీవోఏ అతిగా స్పందించి తీవ్ర చర్యలు తీసుకుందని విమర్శలు వచ్చాయి. దిగ్గజ ఆటగాళ్లు గంగూలీ, ద్రవిడ్ సైతం కుర్రాళ్లు తప్పులు తెలుసుకుని ముందుకుసాగే అవకాశం ఇవ్వాలని సూచించారు.
ఇదే సమయంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సైతం విచారణ కొనసాగిస్తూనే రాహుల్, పాండ్యాలపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. మొత్తానికి కోర్టు సహాయకుడి బాధ్యతల స్వీకారంతో కథ సుఖాంతమైంది. దీనిపై ఖన్నా మాట్లాడుతూ..‘రాహుల్, పాండ్యా ఇప్పటికే తగినంత శిక్ష అనుభవించారు. ఈ పరిణామంతో పరిణతి చెందుతారు. ఇకపై ప్రపంచకప్ సన్నాహం మీద దృష్టిపెడతారు. అక్కడ హార్దిక్ కీలకం కానున్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోర్టు కేసు ఎదుర్కొంటూ కూడా దేశానికి ఆడుతున్నాడు. దీనినే మన క్రికెటర్లకు ఎందుకు వర్తింపచేయకూడదు.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment