
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లిని ఒక్కసారి నేరుగా కలిస్తే చాలు.. ఒక్క సెల్ఫీ దిగితే చాలు అని ఆశపడే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అందుకోసం హద్దులు దాటేందుకు కూడా వెనకాడరంటే అతిశయోక్తి కాదు. గురువారం నాటి ఇండియా- వెస్టిండీస్ టెస్టు మ్యాచులో జరిగిన ఆసక్తికర సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో కోహ్లి బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో ఇద్దరు అభిమానులు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మరీ మైదానంలోకి ప్రవేశించారు. కోహ్లితో సెల్ఫీ దిగేందుకు ఫోన్లతో సిద్ధమైపోయారు. ఇలా చేయొద్దంటూ కోహ్లి సున్నితంగా వారించినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆ ఇద్దరు యువకులను బయటికి పంపించి వేశారు. కాగా కోహ్లికి ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ అభిమాని పరుగెత్తుకుని వచ్చి కోహ్లి పాదాలపై పడ్డాడు. ఇక గురువారం నాటి మొదటి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన భారత యువ ఆటగాడు పృథ్వీ షా పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
.
Comments
Please login to add a commentAdd a comment