'ఫాస్టెస్ట్ గోల్' రికార్డు!
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ముందే సరికొత్త రికార్డు నమోదైంది. ఒలింపిక్స్ లో భాగంగా మహిళల సాకర్ పోరులో కెనడా క్రీడాకారిణి జనైన్ బెకీ కేవలం 20 సెకెండ్లలోపే గోల్ నమోదు చేసి కొత్త చరిత్రను లిఖించింది. తద్వారా ఒలింపిక్స్ సాకర్ చరిత్రలో అత్యంత వేగంగా గోల్ నమోదు చేసిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. భారత కాలమాన ప్రకారం బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల ఫుట్ బాల్ మ్యాచ్లో బెకీ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బెకీ ఆదిలోనే గోల్ సాధించడంతో కెనడాకు 1-0 ఆధిక్యం లభించింది.
ఆ తరువాత ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించినా కెనడా పటిష్టమైన రక్షణశ్రేణిని ఛేదించడంలో విఫలమైంది. తొలి అర్థభాగంలో అందివచ్చిన అవకాశాలను ఆస్ట్రేలియా జారు విడుచుకోవడంతో ఆ జట్టు ఖాతాను తెరవలేకపోయింది. ఇక రెండో అర్థభాగం 73వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్ గా మలచడంలో బెకీ విఫలమైనా, 80వ నిమిషంలో క్రిస్టెయిన్ సింక్లయిర్ గోల్ సాధించడంతో కెనడా 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు శుక్రవారం తెరలేవనుండగా, రెండో రోజులు ముందుగానే మహిళా ఫుట్ బాల్ మ్యాచ్ లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మిగతా మహిళా ఫుట్ బాల్ మ్యాచ్ ల్లో చైనాపై బ్రెజిల్, దక్షిణాఫ్రికాపై స్వీడన్ లు గెలుపొందాయి.