అఫ్ఘానిస్థాన్‌లో వికసిస్తున్న క్రీడా కుసుమాలు
అప్ఘానిస్థాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది తాలిబన్లు... వారు సృష్టించిన మారణహోమం... అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని ముష్కరులు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. మహిళలనైతే పురుగుల్లా చూశారు. పంజరాల్లో బంధించినట్లుగా ఇళ్లకే పరిమితం చేశారు. క్రీడా మైదానాల్లోకి వారికి కనీసం ప్రవేశం కూడా ఉండేది కాదు.. అయితే ఇదంతా పుష్కరకాలం కిందటి మాట... ఇప్పుడు అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రికెట్ బ్యాట్ పట్టాలన్నా... ట్రాక్‌పై పరుగెత్తాలన్నా... ఫుట్‌బాల్ బంతిని కిక్ చేయాలన్నా... బాక్సింగ్ గ్లవ్స్ తొడగాలన్నా భయంతో వణికిపోయిన వాళ్లే ఇప్పుడు స్వేచ్ఛగా తాము ఎంచుకున్న క్రీడలో సత్తా చాటుతున్నారు. ఇప్పుడు వారిలో ఎక్కడాలేని క్రీడాస్ఫూర్తి వెల్లివిరుస్తోంది.
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు
అఫ్ఘానిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలై 1992లో తాలిబన్ల శకం ఆరంభంతోనే మహిళలకు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల పాటు వారి బతుకులు జంతువుల కన్నా హీనంగా తయారయ్యాయి. జంతువులను బంధించడం, పక్షులను పంజరాల్లో ఉంచడంపై నిషేధం విధించిన వాళ్లే మహిళలను ఒక రకంగా ఆ స్థాయి దాకా తీసుకొచ్చారు. వారి దృష్టిలో మహిళలకు ఏ ప్రాముఖ్యతా లేదు. మగవారి సెక్స్ కోరికలను తీర్చే వస్తువులుగా, పిల్లల్ని కనే యంత్రాలుగా, ఇళ్లలో వెట్టిచాకిరీ చేసే పని మనుషుల్లాగానే భావించారు. సవాలక్ష ఆంక్షల కారణంగా సొంతింట్లోనే నాలుగు గోడల మధ్య బందీలుగా తయారయ్యారు. ఫలితంగా మహిళలు తాలిబన్ల రాజ్యంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. ఆడపిల్లలు చదవకుండా ఆంక్షలు విధించారు. ఇక క్రీడల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. స్పోర్ట్స్‌పై నిషేధం విధించడమే కాకుండా కనీసం వారిని మైదానాల్లోకి కూడా రానిచ్చేవారు కాదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
పంజరం నుంచి...
సెప్టెంబర్ 11 దాడుల్లో అల్‌కాయిదా హస్తం ఉందని తేలడంతో అమెరికా ఆపరేషన్ అఫ్ఘానిస్థాన్ చేపట్టింది. నాటో దళాలు రంగ ప్రవేశం చేయడంతో అక్కడ తాలిబన్ల శకం ముగింపు దశకు చేరుకుంది. 2001లో తాలిబన్లు అధికారాన్ని కోల్పోయాక మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. ఇదే అఫ్ఘానిస్థాన్‌లో క్రీడలకు మళ్లీ ఊపిరిపోసినట్లయింది. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు పురుషులు.. క్రికెట్ మినహా మిగిలిన క్రీడలు ఆడే అవకాశం ఉండేది కాదు. అయితే 2001 తర్వాత పురుషులు మిగిలిన క్రీడలపైనా సత్తా చాటడం మొదలుపెట్టారు. ఇక మహిళలు పంజరం నుంచి బయటపడటమే కాదు.. స్వేచ్ఛగా తమకు నచ్చిన క్రీడలను ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టారు. అది కూడా సంప్రదాయ బద్ధంగానే.
విదేశీయుల చేయూత
ఒకటి కాదు.. రెండు కాదు... దాదాపుగా పదేళ్లు. ఎవరైనా ఏళ్లకేళ్లుగా ఆయా రంగాలకు దూరంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. అందులో తమకున్న నైపుణ్యాన్ని కోల్పోతారు. ముష్కరుల ఆరాచకాలు సాగినన్ని రోజులు క్రీడల్లో ప్రతిభ ఉన్న వాళ్లు ఎందుకు కొరగాకుండా పోయారు. జాతీయంగా, అంతర్జాతీయంగా రాణించే సత్తా ఉన్నా నిషేధం కారణంగా క్రీడాకారులు తమలో తామే కుమిలిపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త తరం రంగ ప్రవేశం చేసింది. క్రీడ ఏదైనా సత్తా చాటడమే లక్ష్యంగా ఆడపిల్లలూ క్రీడా రంగాన్ని కూడా ఎంచుకుంటున్నారు. ఫలితంగా అక్కడ క్రీడాస్ఫూర్తి వెల్లివిరుస్తోంది. తాలిబన్ల నుంచి అధికారం చేజారి 13 సంవత్సరాలైంది. అప్పట్లో ఐదారేళ్ల వయసులో క్రీడలవైపు మొగ్గు చూపిన వాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. కొందరైతే ఒలింపిక్స్‌లో పాల్గొని ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే వీరి ప్రతిభకు పదును పెడుతోంది విదేశీయులంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆడపిల్లలకూ ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ విదేశీ ఒలింపియన్లు వారిని చురకత్తుల్లా తయారు చేస్తున్నారు. ఫలితంగా అఫ్ఘానిస్థాన్ కూడా అంతర్జాతీయంగా తామేంటో నిరూపించుకునే స్థాయికి మెల్లి మెల్లిగా చేరుకుంటోంది.
ఇక్కడా క్రికెట్టే !
దక్షిణాసియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్థాన్ ప్రభావం కారణంగా అఫ్ఘానిస్థాన్‌లోనూ క్రికెట్ అంటే జనం పడి చస్తారు. తాలిబన్లు క్రికెట్ మినహా మిగిలిన క్రీడలపై నిషేధం విధించడంతో అఫ్ఘ్ఘాన్లకు సహజంగానే క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ దేశానికి చెందిన పురుషుల జట్టు ప్రస్తుతం అంతర్జాతీయంగా రాణిస్తుండటంతో.. మహిళల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది. దీంతో 2010లో మహిళల క్రికెట్‌లో జాతీయ జట్టును ఎంపిక చేశారు. 2011లో ఏసీసీ మహిళల టి20లో పాల్గొనాల్సి ఉన్న అఫ్ఘానిస్థాన్ జట్టును ఆ దేశంలో కొన్ని గ్రూపులు అడ్డుకోవడంతో టోర్నీలో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం మహిళల జట్టు ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతామా అని ఎదురుచూస్తోంది.
అథ్లెటిక్స్ నుంచి వాలీబాల్ దాకా...
తాము ఎంచుకున్న రంగంలో సత్తా చాటాలన్న ఆశయం.. అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించాలన్న లక్ష్యం ఇప్పుడు అఫ్ఘానిస్థాన్ మహిళల్లో కనిపిస్తోంది. తామూ ఎవరికీ తీసిపోమని నిరూపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, సైక్లింగ్, ఫుట్‌బాల్, మార్షల్ ఆర్ట్స్, వాలీబాల్ ఇలా పలు క్రీడలను ఎంచుకుని, ఆటల్లో మెరుపులు మెరిపిస్తున్నారు.
రియోకు అఫ్ఘాన్ బాక్సర్లు ?
అప్ఘానిస్థాన్‌లో చాలా మంది క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్, బాక్సింగ్‌లో మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. అయితే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా అఫ్ఘాన్ బాక్సర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో అఫ్ఘాన్ క్రీడాకారిణిలు ఇప్పటిదాకా అథ్లెటిక్స్, జూడోలో మాత్రమే దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే 2016లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో అఫ్ఘాన్ బాక్సర్లు బరిలోకి దిగడం ఖాయం. అదే జరిగితే వీళ్లు పతకాలు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అరకొర సౌకర్యాల మధ్యే
తాలిబన్ల కారణంగా అంతర్జాతీయ క్రీడల్లో అంతంతమాత్రంగానే ఉన్న అఫ్ఘానిస్థాన్‌లో సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయని చెప్పాలి. 1970ల్లో అప్పట్లో ఫుట్‌బాల్‌పై ఉన్న ఆదరణతో ప్రధాన నగరాల్లో సాకర్ స్టేడియాలను నిర్మించారు. దేశంలో అరాచక శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఆదరణకు నోచుకోకపోవడంతో పాతబడి పోయాయి. అఫ్ఘాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో వీటి పునర్‌నిర్మాణ పనులను చేపట్టే పరిస్థితి లేదు. అయితే అఫ్ఘాన్ ప్రజలు క్రికెట్‌పై ఆసక్తి చూపుతుండటంతో జలాలాబాద్‌లో అధునాతన సౌకర్యాలతో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సహకారంతో దేశవ్యాప్తంగా 34 ప్రావిన్స్‌ల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణంపై అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు దృష్టిపెట్టింది. మరోవైపు కాబూల్‌లో పెద్ద జిమ్నాజియంను నిర్మిస్తున్నారు.
ఆగని అరాచకాలు
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలో లేకపోయినా వారి అరాచకాలు మాత్రం ఆగడం లేదు. తాము ఆధిపత్యం చలాయించిన రోజుల్లో క్రీడలపై నిషేధం విధించిన ముష్కరులు ఇప్పుడు అఫ్ఘాన్ యువత స్పోర్ట్స్‌పై ఆసక్తి పెంచుకోవడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే అక్కడక్కడ ప్లేయర్లపై ఏదో రకంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ముష్కరులు తక్‌హార్ ప్రావిన్స్‌లో ఇద్దరిని, కాందహార్ ప్రావిన్స్‌లో ముగ్గురిని, లాగ్‌మన్ ప్రావిన్స్‌లో ఐదుగురిని కాల్చి చంపారు. వీళ్లంతా క్రీడాకారులే. సాధన చేస్తున్న సమయంలోనే వీరిపై తెగబడ్డారు. క్రీడలవైపు ఆసక్తి చూపుతున్న వారిని భయపెట్టి తమ పంతం నెగ్గించుకోవాలని ముష్కరులు భావిస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు.
మూడేళ్లలోనే ఒలింపిక్స్ బరిలో...
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లకు తెలియకుండానే క్రీడల్లో ప్రావీణ్యాన్ని సంపాదించిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది రోబినా ముఖిమ్‌యార్, ఫ్రిబా రజాయి.. ఈ ఇద్దరు ఏథెన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. రోబినా 100 మీటర్ల స్ప్రింట్‌లో, ఫ్రిబా జూడోలో ఆఫ్ఘానిస్థాన్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తాలిబన్ల అరాచకాలు సాగుతున్న సమయంలో అటు ఇంట్లోనే చదువుకుంటూ ఇటు మైదానంలోకి అడుగు పెట్టకుండానే క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించారు. 2001లో తాలిబన్ల శకం ముగిశాక రోబినా, ఫ్రిబా మూడేళ్ల పాటు తీవ్రంగా సాధన చేసి ఒలింపిక్స్ బరిలో నిలిచారు.
ఇక ఏథెన్స్‌లో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో రోబినా.. హిజాబ్(బురఖా) ధరించి 100 మీటర్ల పరుగులో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో దేశం తరఫున బరిలోకి దిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా... తాలిబన్ల శకం ముగిసినా ఆఫ్ఘాన్‌లో ఏదో రకంగా విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ధైర్యంగా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన రోబినాను చూసి అంతా మెచ్చుకున్నారు. క్రీడల కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తానని రోబినా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆమె ధైర్యంగా చేసిన ఈ ప్రకటన తోటి క్రీడాకారిణిలను, మహిళలను ఎంతో ఉత్తేజపరిచింది. రెండేళ్ల కిందట లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో తహ్మినా కొహిస్తానీ.. రోబినా బాటలో 100 మీటర్ల పరుగులో హిజాబ్ ధరించి పాల్గొన్నది. ప్రిలిమినరీ దశలోనే వెనుదిరిగినా.. వ్యక్తిగత రికార్డును సాధించింది. ఇలా రోబినా స్ఫూర్తిగా ఎందరో ఆడపిల్లలు అఫ్ఘాన్‌లో క్రీడల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.
పంజరం నుంచి బయటకు...
Published Fri, Sep 12 2014 10:44 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement