
‘ఫిక్సింగ్’ సైరన్!
కామెరూన్ జట్టుపై నీలినీడలు
జట్టులో ఏడుగురు ఆటగాళ్లపై అనుమానం... విచారణకు ఆదేశం
యావోఉందె (కామెరూన్): ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో లీగ్ దశలోనే నిష్ర్కమించిన కామెరూన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు కామెరూన్ ఫుట్‌బాల్ సంఘం అనుమానిస్తోంది. ఈ మేరకు ఫిక్సింగ్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు కూడా ఆదేశించింది. ‘లీగ్ దశలో కామెరూన్ ఆడిన మూడు మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌పై ఎక్కువ అనుమానం ఉంది. జాతీయ జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లు నీతి నియమాలకు, విలువలకు విరుద్ధంగా వ్యవహరించారు’ అని కామెరూన్ ఫుట్‌బాల్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
క్రొయేషియాతో జరిగే మ్యాచ్‌లో కామెరూన్ 0-4 గోల్స్ తేడాతో ఓడిపోతుందని... తొలి అర్ధభాగంలో కామెరూన్ జట్టు నుంచి ఒకరు రెడ్ కార్డుకు గురై మైదానం నుంచి నిష్ర్కమిస్తాడని... సింగపూర్‌కు చెందిన మ్యాచ్ ఫిక్సర్ విల్సన్ రాజ్ పెరుమాళ్ మ్యాచ్‌కు ముందు జర్మనీ మేగజైన్ డెర్ స్పైజెల్‌తో ఇంటర్వ్యూలో తెలిపాడు.
మ్యాచ్ ఫిక్సర్ ముందుగా ఊహించినట్టే క్రొయేషియాతో మ్యాచ్‌లో కామెరూన్ 0-4తో ఓడింది. తొలి అర్ధభాగం 40వ నిమిషంలో కామెరూన్ ఆటగాడు అలెక్స్ సాంగ్ ప్రత్యర్థి జట్టు సభ్యుడు మాంద్‌జుకిక్‌ను మోచేతితో ఢీకొట్టి ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. కామెరూన్‌పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని ‘ఫిఫా’ తెలిపింది.
ప్రపంచకప్‌కు అత్యధికంగా ఏడుసార్లు అర్హత సాధించిన ఆఫ్రికా జట్టు కామెరూన్. 1990లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. ఈసారి ప్రపంచకప్‌లో కామెరూన్‌కు ఆది నుంచి ఇబ్బందులే ఎదురయ్యాయి. బోనస్ వ్యవహారం పరిష్కరించేవరకు బ్రెజిల్ విమానం ఎక్కేదిలేదని ఆటగాళ్లు భీష్మించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కామెరూన్ మేటి ఆటగాడు శామ్యూల్ ఎటో పూర్తిస్థాయిలో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో 0-1తో మెక్సికో చేతిలో ఓడిన కామెరూన్... రెండో మ్యాచ్‌లో 0-4తో క్రొయేషియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 1-4తో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది.