
విశ్లేషించాల్సిన జట్ల సంఖ్య తగ్గిపోయి ప్రపంచ కప్ పోటా పోటీ దశకు వచ్చేసింది. తమదైన పంథాలో ఆడిన ఈ జట్లన్నీ క్వార్టర్స్ చేరేందుకు అర్హమైనవే. కాగితంపై ఒక్క పేరుతో ఓ జట్టు ప్రత్యర్థి కంటే బలంగా కనిపించవచ్చు. కానీ మైదానంలో ఆ తేడా లెక్కలోకి రాదు. ఒకరినొకరు అధిగమించాలనే కాంక్ష ప్రతి జట్టులో ఉండటం సాధారణం. ఇప్పటివరకు చూస్తే స్వీడన్‌పై ఇంగ్లండ్‌కు, రష్యాపై క్రొయేషియాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. వారి దాడుల్లో అదనపు మెరుపు కనిపిస్తోంది. ఈ కప్‌లో అంచనాలన్నీ గల్లంతవుతున్నాయి కాబట్టి... క్వార్టర్స్‌లో విజేతలెవరో కచ్చితంగా చెప్పలేం. గారెత్ సౌత్ గేట్ శిక్షణలో ఇంగ్లండ్ రంజింపజేసేలా ఆడుతోంది. సమతూకంతోనూ ఉంది. 3–1–4–2 వ్యూహంతో బలంగానూ కనిపిస్తోంది. 52 ఏళ్ల తర్వాత కప్‌ను అందుకోవాలని ఆశిస్తోంది. క్రమశిక్షణతో ఆడుతున్న ఆ జట్టులో ఎక్కువ మంది యువకులే. సూపర్ స్టార్లెవరూ లేరు. వీరంతా ఆశలు రేకెత్తిస్తున్నారు. దాడులపైనే వారు దృష్టి పెడుతున్నారు. ప్రపంచ కప్‌లో గతంలో తమ జట్లు సాధించలేని పెనాల్టీ షూటౌట్ విజయాన్ని ఈసారి అందించారు.
ఇద్దరు స్ట్రయికర్లకు ఎక్కువ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా వింగ్ బ్యాక్స్ మంచి జోరులో ఉన్నారు. పనామా, ట్యూనీషియాలపై ఇది పని చేసినా కొలంబియాపై కుదరలేదు. ఎత్తైన డిఫెండర్లున్న స్వీడన్‌కు బాక్స్ లోపలి ఏరియాలో గాలిలో బంతిని నియంత్రించగలిగే అవకాశం ఉంటుంది. సౌత్‌గేట్ దీనికి విరుగుడు వ్యూహం కనిపెట్టి ప్రత్యర్థిని ఆశ్చర్యానికి గురిచేస్తాడేమో చూడాలి. సొంతగడ్డపై లభించే మద్దతుతో సాధారణ జట్టు కూడా గొప్ప విజయాలు సాధిస్తుంది అనేందుకు రష్యానే ఉదాహరణ. వారి ప్రయాణం ఊహించినదాని కంటే మించినది. మరోసారి 45 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో పరీక్షకు నిలవనుంది. విధ్వంసక దాడుల క్రొయేషియా... ఆతిథ్య జట్టుతో సమరానికి సిద్ధమైంది. స్పెయిన్‌ను పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకొచ్చిన రష్యా తర్వాత దాని కథ ముగించింది. ఇలాంటివాటికి అపారమైన మానసిక బలం, ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం. దేశం కోసంప్రాణాలైనా అర్పించే ఈ స్వభావాన్ని నేను ఇష్టపడతా. రష్యా మళ్లీ మళ్లీ అలానే ఆడుతుందని ఆశిస్తున్నా. ముచ్చటైన ఆటతీరుతో అలరిస్తున్న మరో జట్టు క్రొయేషియా. లుకా మోడ్రిక్ రూపంలో వారికో మృదువైన ఆటగాడున్నాడు. జట్టు ఓ కారైతే... అతడు ఇంజిన్. బాధ్యతలు తెలుసుకుని, జాగరూకతతో ఆడే సభ్యులున్నందున వారు మోడ్రిక్‌పైనే ఆధార పడటం లేదు. అనుభవంతో కఠిన పరిస్థితులను తట్టుకునే ఇవాన్ రాక్టిక్, మారియో మండ్జుకిక్‌లు ఎక్కడైనా రాణించగలరు.
Comments
Please login to add a commentAdd a comment