కొలంబియా ‘కేక’
కొలంబియా : 3
అర్మెరో: 5వ ని.
గ్యుటెరెజ్: 58వ ని.
జేమ్స్ రొడ్రిగ్వెజ్: 93వ ని
గ్రీస్ : 0
బెలో హారిజోంట్: ఫిఫా ప్రపంచకప్‌ను కొలంబియా విజయంతో మొదలుపెట్టింది. శనివారం రాత్రి జరిగిన గ్రూప్ ‘సి’ తొలి మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో గ్రీస్‌ను చిత్తు చేసింది. 5వ నిమిషంలో అర్మెరో, 58వ నిమిషంలో గ్యుటెరెజ్ జట్టుకు గోల్స్ అందించగా.. 93వ నిమిషంలో (ఇంజ్యురీ టైమ్) సమయంలో రొడ్రిగ్వెజ్ మూడో గోల్ సాధించాడు. గ్రీస్ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.
మ్యాచ్ ఆరంభం నుంచే కొలంబియా పటిష్టమైన గ్రీస్ రక్షణ వలయంలోకి దూసుకెళ్లింది. ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే కొలంబియా తొలి గోల్ నమోదు చేసింది. డిఫెండర్ అర్మెరో జట్టుకు ఈ గోల్ (5వ ని.) అందించాడు. 1998 ప్రపంచకప్ తర్వాత కొలంబియాకు ఇదే తొలి గోల్ కావడం విశేషం.
ఆ తర్వాత కొలంబియా అదే దూకుడును కొనసాగించినా.. గ్రీస్ డిఫెండర్లు వారిని నిలువరించడంలో సఫలమయ్యారు. 45వ నిమిషంలో గ్రీస్ మిడ్‌ఫీల్డర్ కోన్ చేసిన గోల్ యత్నాన్ని కొలంబియా గోల్ కీపర్ ఒస్పినా డైవ్ చేసి అడ్డుకున్నాడు.
ళీ తొలి అర్ధ భాగం ముగిసే సరికి కొలంబియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొత్తానికి గ్రీస్ మూడుసార్లు... కొలంబియా ఓ సారి గోల్ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో సఫలమయ్యాయి.
రెండో అర్ధభాగంలో కొలంబియా, గ్రీస్ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 58వ నిమిషంలో కార్నర్ కిక్‌ను అందుకున్న ఫార్వర్డ్ గ్యుటెరెజ్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. ఫలితంగా కొలంబియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
నిర్ణీత సమయంలో గోల్స్ కోసం గ్రీస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే 90 నిమిషాలు ముగిశాక అదనపు ఇంజ్యురీ టైమ్‌లో జేమ్స్ రొడ్రిగ్వెజ్ మూడో గోల్ అందించాడు.