సాక్షి, న్యూఢిల్లీ : గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ తప్పులు చేయకూడదనే ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ, మన క్రీడా శాఖ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. విమర్శలు, వివాదాలు వాటికి కొత్తేం కాదు. దేశంలో తొలిసారి ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (అండర్ 17) నిర్వహిస్తున్నప్పటికీ.. కనీస సదుపాయాలను కల్పించడంలో ఘోరంగా విఫలమవుతూ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
శుక్రవారం నుంచి మొదలైన ఈ క్రీడా సంబురంలో భారత్ అమెరికా చేతిలో పరాజయం పాలైంది. అయితే భారత్ తొలి మ్యాచ్ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘జవహార్ లాల్ నెహ్రూ మైదానాని’కు రావటంతో ప్రేక్షకులను నింపే ఉద్దేశ్యంతో ఫ్రీ టికెట్లు జారీ చేసి సుమారు 27 వేల మంది విద్యార్థులను రప్పించింది క్రీడా శాఖ. మ్యాచ్ నిరాశపరిచినప్పటికీ... వారి కోలాహలంతో మైదానం మారు మోగిపోయింది. ఇంత దాకా బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అసలే ఎండ.. పైగా ఉక్కపోత... దీనికి తోడు అరిచి ఉండటంతో దాహర్తితో ప్రేక్షకులు అల్లలాడిపోయారు. మైదానంలోకి బాటిళ్లను అనుమతించకపోగా.. స్టేడియం నిర్వాహకులు కూడా లోపల నీటి సదుపాయాన్ని కల్పించలేకపోయారు. దీంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అందుబాటులో ఉంచిన కొన్ని నీళ్ల సీసాలు సరిపోకపోవడంతో వా(నీ)టి కోసం పోటీ పడ్డారు. దక్కనివారు దాహానికి తాళలేక టాయిలెట్‌లోని నళ్లా నీటి ద్వారా దాహం తీర్చుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వాటర్ బాటిల్ కోసం ఎంతైనా వెచ్చిస్తాం.. అందించండి అంటూ భద్రతా సిబ్బందిని వేడుకోవటం కనిపించింది. అదే సమయంలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఆహార పదార్థాలు భద్రతా కారణాల దృష్ట్యా ఆలస్యం లోపలికి అనుమతించారు. దీంతో మ్యాచ్ రెండో సగం తర్వాతే వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఓవైపు నీళ్లు.. మరోవైపు తిండి లేక అభిమానులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇక స్టేడియంలో డస్ట్‌బిన్‌లు సరిపడా ఉంచకపోవడంతో స్టేడియం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. గ్రౌండ్ నిర్వాహకులు.. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘోరంగా వైఫల్యం చెందినట్లు స్థానిక నిర్వాహక కమిటీ ఆరోపిస్తోంది. గతంలో కామన్‌వెల్త్ క్రీడలు-2010 సందర్భంగా కూడా సరైన ఏర్పాట్లు కల్పించలేకపోయిందని క్రీడా శాఖపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన క్రీడా వేడుకలపై నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment