తొలి రోజే 14 వికెట్లు
తమిళనాడు 134, కర్ణాటక 45/4
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
ముంబై: భారత దేశవాళీ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తుది పోరు సంచలనంతో ప్రారంభమైంది. బౌలింగ్‌కు అనుకూలించిన వాంఖడే పిచ్‌పై ముందుగా డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ప్రత్యర్థి తమిళనాడును కుప్పకూల్చగా...ఆ తర్వాత తమిళనాడు కూడా అదే రీతిలో జవాబివ్వడంతో మ్యాచ్ మొదటి రోజే 14 వికెట్లు నేలకూలాయి.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అభినవ్ ముకుంద్ (35) టాప్‌స్కోరర్ కాగా... ఇంద్రజిత్ (27), అశ్విన్ క్రైస్ట్ (21) ఓ మాదిరిగా ఆడారు. కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ 34 పరుగులకే 5 వికెట్లు తీయడం విశేషం. మిథున్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం కర్ణాటక కూడా తడబడింది. ఎల్. బాలాజీ (3/10) చెలరేగడంతో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి తమ మొదటి ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్), మిథున్ (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న కర్ణాటక ప్రస్తుతం మరో 89 పరుగులు వెనుకబడి ఉంది.