
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో నేతలు అదుపుతప్పి ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దూషణలు దిగుతున్నారు. మొత్తానికి కర్ణాటకలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్టు కనిపిస్తోంది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో మత ఉద్రిక్తతలను పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు బీజేపీని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో పోలుస్తూ కర్ణాటక హోమంత్రి రామలింగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కర్ణాటకలో బీజేపీ నేతలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారు. వారు ఐఎస్‌ఐఎస్ తరహాలో ఉన్నారు. అమిత్ షా వారి అధిపతి' అని రామలింగారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై నిందాత్మక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153, 504 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.