రాహుల్, అమిత్‌షా
కాంగ్రెస్, బీజేపీలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నంత ప్రతిష్టాత్మకంగా మారాయి. కన్నడ ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది అంతుచిక్కకపోవడం ఈ పార్టీలను మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చునని వివిధ సర్వేలు చెబుతున్న నేపథ్యంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుందన్న అంచనాల మధ్య ప్రధానపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
మునుపెన్నడూ లేని విధంగా ఈ పార్టీల అధినేతలు అమిత్‌షా, రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా ఒక రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లో రెండు ప్రధాన జాతీయపార్టీల అధ్యక్షులుగా పర్యటించడం ఇదే తొలిసారి. ఒక రాష్ట్రంలో అనుసరించే వ్యూహ,ప్రతివ్యూహాలను ఎక్కడో ఢిల్లీలో కూర్చోని రూపొందించే పద్ధతికి భిన్నంగా ఎన్నికలు జరుగుతున్న చోటికే వచ్చి తామే ముందుండి నడిపిస్తున్నారు. రాహుల్ గత శుక్రవారమే మొత్తం 30 జిల్లాల పర్యటన ముగించగా, అమిత్ షా సోమవారం ఆ పని పూర్తిచేశారు.
మొదటి ఏఐసీసీ అధ్యక్షుడు...
కర్ణాటకలోని 30 జిల్లాల పరిధిలోని 3,500 కి.మీ దూరం పర్యటించిన మొదటి ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ రికార్డ్ సృష్టించినట్లు కాంగ్రెస్‌వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రచార కార్యకమాల్లో భాగంగా దాదాపు 20–25 దేవాలయాలు, మఠాలు సందర్శించి హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బళ్లారి–కలబురగిల మధ్య 400 కి.మీ రోడ్‌షో నిర్వహించారు. దాదాపు వందరోజుల క్రితమే బళ్లారిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాక రాష్ట్రం నలుమూలలూ కవర్ చేయడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో పర్యటించారు.
హెలికాప్టర్, ప్రత్యేక విమానం, బస్సులు, ఇలా వివిధ సాధనాల ద్వారా ప్రచారం జరిపారు. దీనికి టెక్నాలజీని కూడా అనుసంథానం చేసి, అన్ని పర్యటనలు, ర్యాలీలు ట్విటర్, ఫేస్‌బుక్ ఇతర సామాజికవేదికల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలతో కలగలిసిపోయే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, కోస్తా కర్ణాటక, మధ్య కర్ణాటక, పాతమైసూరులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
విస్తృతంగా పర్యటిస్తున్న అమిత్‌షా...
బీజేపీ అధినేత అమిత్‌షా సైతం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పూర్తి ఉత్సాహంతో కర్ణాటక మొత్తం పర్యటిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక మొత్తాన్ని చుట్టివచ్చిన తొలి బీజేపీ జాతీయఅధ్యక్షుడిగా ఆయన నిలుస్తున్నారు. జిల్లా పర్యటనలకు వెళ్లినపుడు స్వయంగా బ్లాక్(సమితి)స్థాయి కార్యకర్తలతో సమావేశమై అక్కడ పార్టీ విజయావకాశాలపై క్షేత్రస్థాయి నుంచి స్పందన తెలుసుకుంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకే పరిమితం కాకుండా ఎక్కడకు వెళ్లినా స్థానిక పురప్రముఖులు, పార్టీ సానుభూతిపరులు, వివిధ రంగాలకు చెందిన పెద్దలు, వర్గాలతో సమావేశమవుతున్నారు.
ప్రచారంలో భాగంగా కిందిస్థాయి కార్యకర్తల్లో చైతన్యం నింపే ›ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రనాయకులపై ఆధారపడకుండానే టికెట్ల కేటాయింపు, తదితర విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ దిశానిర్దేశంలో ప్రధాని మోదీతో పాటు తనదీ కీలక భూమికే అన్న సంకేతాన్ని నాయకులకు ఇవ్వడంలో సఫలమయ్యారు. అటు మధ్య కర్ణాటక, పాత మైసూరు మొదలుకుని హైదరాబాద్ కర్ణాటక వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు.
ఇక మోదీ క్యాంపెయిన్ షురూ...
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చామరాజనగర్ జిల్లా సంతేమారనహల్లిలో జరిగే ర్యాలీతో తన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఉడుపి, కష్ణా మఠం, పేజావర్ మఠం సందర్శించి చిక్కోడి ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజుల్లో గుల్భార్గ, బళ్లారి, బెంగళూరు, తుమ్‌కూరు, శివమొగ్గ, హెబ్బాలి, విజయపుర, మంగళూరు, ఇలా అయిదురోజుల విస్తత పర్యటనలో భాగంగా 15 వరకు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment