రాబడి రెట్టింపు | increasing income to government with new check posts | Sakshi
Sakshi News home page

రాబడి రెట్టింపు

Published Sat, Mar 1 2014 10:47 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

increasing income to government with new check posts

సాక్షి, ముంబై: రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులవల్ల ప్రభుత్వ రాబడి ఆదాయం రెట్టింపు అయింది. రాష్ట్రానికి  ఆనుకుని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోకి, మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు సరుకులను రవాణా చేసే వేలాది ట్రక్కులు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. ఈ ట్రక్కుల ద్వారా నిత్యం వేలాది టన్నుల సరుకు రవాణా అవుతుంది. గతంలో సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక చెక్‌పోస్టులు లేకపోవడంతో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ప్రభుత్వం గమనించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల 16 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసింది.  వీటి ద్వారా కొద్ది రోజుల్లోనే రాబడి రెండింతలైంది. గతంలో సరిహద్దులో ఆధునిక చెక్‌పోస్టులు లేకపోవడంవల్ల ట్రక్కులను సరిగా తనిఖీ చేయడం సాధ్యమయ్యేది కాదు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొక్కుబడిగా తనిఖీ చేసేవారు. సరుకుల బరువును తూకం వేసేందుకు తగిన ధర్మకాంటా లేకపోవడంతో డ్రైవర్లు ప్రైవేటు కాంటాల వద్ద తూకం వేయించి రసీదుతో వచ్చేవారు. తక్కువ బరువు చూపించి రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించేవారు. తత్ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గుండిపడింది. అంతేకాకుండా ట్రక్కుల తనిఖీకి ఎక్కువ సమయం పట్టడంతో చెక్ పోస్టులవద్ద వాహనాల బారులుతీరేవి. దీంతో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తేది. అయితే ఆధునిక చెక్ పోస్టులతో అక్రమాలకు కళ్లెం పడిందనే విషయం పెరిగిన రాబడి స్పష్టం చేసింది.

 అదేవిధంగా సామర్థ్యానికి మించి సరుకులు చేరవేస్తున్న వాహనదారులకు కూడా కళ్లెం పడింది. దీంతో వారు నిబంధనల ప్రకారం ట్రక్కుల్లో సరుకును తరలించడం ప్రారంభించారు. ఆధునిక చెక్‌పోస్టులు అందుబాటులోకి రావడంతో నియమాలు ఉల్లంఘించి సరుకులు చేరవేస్తున్న 3,318 ట్రక్కులను పట్టుకున్నారు. ఈ చెక్‌పోస్టులు లేకముందు కేవలం 132 ట్రక్కులు మాత్రమే పట్టుబడ్డాయి. మిగతా ఆరు సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక చెక్ పోస్టులు ప్రారంభిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement