మోడీ పీఎం కావడం తథ్యం
- వెంకయ్య ధీమా
- బిజేపీలో అసంతృప్తికి చోటు లేదు
- కాంగ్రెస్ భూస్తాపితం
సాక్షి, చెన్నై : దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రా, కర్నాటకలో మోడీ ప్రభంజనం అధికంగా ఉందని, మోడీ పీఎం కావడం తథ్యమని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అసంతృప్తి అన్న పదానికి చోటు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. టీ నగర్‌లోని కమలాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమ ఓటును ఆయుధంగా మలుచుకునేందుకు ప్రజలు సిద్ధం అయ్యారన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ పాలకులు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు సైతం యూపీఏపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, అనేక రాష్ట్రాల్లో తమ నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధ పడుతున్నాయని పేర్కొన్నారు.
తమిళనాడులో 45 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఓ మెగా కూటమి ఆవిర్భవించడం శుభసూచకంగా అభివర్ణించారు. అది కూడా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శమన్నారు.
జాతీయ స్థాయిలోనూ, తమిళనాడులోని బీజేపీ కూటమి అత్యధిక సీట్లను కైవశం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపికి 230-240 సీట్లు, మిత్రులతో కలుపుకుంటే 300 సీట్లు సాధించి తీరుతామన్నారు. సీమాంధ్ర, తెలంగాణల్లోను అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్‌టీఆర్ పేరును మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలన తీరు అలా ఉంటుందని వివరించారు.
శ్రీలంకలోని ఈలం తమిళులకు సమన్యాయం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, జాలర్లపై దాడులకు ముగింపు పలుకుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బిజేపీలో అసంతృప్తి అన్న పదానికి ఆస్కారం లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అద్వాని, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సింగ్‌లను పార్టీ పక్కన పెట్ట లేదని, మోడీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా వెంకయ్య నాయుడు సమక్షంలో కృష్ణగిరి, కన్యాకుమారిలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, సీనియర్ నాయకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం దక్షిణ చెన్నై పార్టీ అభ్యర్థి ఇలగణేషన్‌కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో వెంకయ్య నాయుడు ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేశారు.
ప్రచారానికి శ్రీకారం: బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలోఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ స్థానం బరిలో ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.