ముంబై: క్రికెటర్లు తమ డోపింగ్ పరీక్షల పరిధిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తమదైన శైలిలో కొరడా ఝళిపించింది. ఐదుగురు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు నిబంధనల ప్రకారం తమ వివరాలు వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసులు జారీ చేసింది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా, రవీంద్ర జడేజా, లోకేశ్ రాహుల్‌తో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు నోటీసులు పంపించినట్లు ‘నాడా’ పేర్కొంది. దీనికి సాఫ్ట్‌వేర్ సమస్యలే కారణమంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇచ్చిన వివరణతో ‘నాడా’ సంతృప్తి చెందినట్లుగా కనిపించడం లేదు.
పూర్తి వివరాలు ఇవ్వకుండా...
సుదీర్ఘ కాలంగా ‘నాడా’ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటూ వచ్చిన బీసీసీఐ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో డోపింగ్ వ్యవస్థలో భాగమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేషనల్ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఎన్‌ఆర్‌టీపీ)లో క్రికెటర్లతో సహా మొత్తం 110 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఏడాదిలో కనీసం ఎప్పుడైనా ‘నాడా’ కోరినప్పుడు ఆటగాళ్లు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ‘ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు’ అనేది కీలకమైంది.
ఫలానా సమయంలో తాము ఫలానా చోట ఉన్నామంటూ ఆటగాళ్లు స్వయంగా యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్స్ సిస్టమ్స్ (ఏడీఏఎంఎస్) ఫామ్‌లో వివరాలు భర్తీ చేయాలి. నిజానికి ఈ ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను తొలగించాలంటూనే సుదీర్ఘ కాలం బీసీసీఐ పోరాడింది. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయవచ్చు. అయితే పెద్దగా చదువుకోని ఆటగాళ్లు ఎవరైనా కొందరు ఉంటే ఇబ్బంది పడవచ్చు కాబట్టి వారి తరఫున ఆయా క్రీడా సమాఖ్యలు కూడా భర్తీ చేసే వెసులుబాటు ఉంది. ఈ బాధ్యతను సమాఖ్యలు తీసుకున్నాయి కూడా. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్ల వివరాలు మాత్రం ‘నాడా’కు అందలేదు.
ఇదేం వివరణ...
సమాచారం అప్‌లోడ్ చేయకపోవడంపై బీసీసీఐ తమ వైపు నుంచి వివరణ పంపించింది. ఏడీఏఎంఎస్‌కు సంబంధించి పాస్‌వర్డ్ విషయంలో కొంత సమస్య రావడం వల్లే తాము వివరాలు వెల్లడించలేకపోయామని బోర్డు పేర్కొంది. అయితే ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ దీనిపై సంతృప్తి చెందలేదు. ఈవెంట్లు జరిగే సమయంలో సమస్య ఉండకపోవచ్చు కానీ లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా ఎలాంటి ఆటలు లేవు కాబట్టి ఈ సమస్యలో ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధన ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘బీసీసీఐ దీనికి కారణం ఏమిటో చెప్పింది. అయితే దీనిపై మేం చర్చిస్తాం. నిజంగా పొరపాటు జరిగిందా లేదంటే దీనిని తొలి వైఫల్యం కింద లెక్క కట్టాలా అనేది తర్వాత నిర్ణయిస్తాం’ అని ఆయన అన్నారు. మూడుసార్లు ఇదే తరహాలో వివరాలు ఇవ్వడంలో విఫలమైతే దానిని డోపింగ్‌గా భావించి రెండేళ్ల నిషేధం విధించేందుకు ‘నాడా’కు అధికారం ఉంది.
ఆ మాత్రం చేయలేరా?
తాజా అంశంపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి స్పందిస్తూ... చిన్న పాస్‌వర్డ్ సమస్యను పరిష్కరించునేందుకు ఇంత సమయం పడుతుందా అని ప్రశ్నించారు. ‘క్రికెటర్లంతా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పైగా ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లలో కూడా కనిపిస్తున్నారు. తమ వివరాలు ఇవ్వాలని ఈ ఐదుగురికి బీసీసీఐ చెబితే సరిపోయేది కదా. పైగా అందరికీ సొంత మేనేజర్లు కూడా ఉన్నారు. వారు చేయలేరా? ఈ సారికి క్షమిస్తే సరి. ‘నాడా’ అధికారికంగా హెచ్చరిక జారీ చేస్తే ఎవరు బాధ్యులు’ అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment