గ్యారీ కాహిల్ ఇంటర్వూ్య
చెల్సీ క్లబ్ కొత్త కెప్టెన్ గ్యారీ కాహిల్. 2012 నుంచి చెల్సీ చరిత్రలో భాగమైన అతను ఇప్పుడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈపీఎల్ సహా ఎఫ్‌ఏ కప్, చాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ ట్రోఫీలు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన గ్యారీ ఇప్పుడు మరో టైటిల్‌పై కన్నేశాడు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ఉన్నపళంగా టైటిల్‌పై కాకుండా ముందుగా ఒక్కో మ్యాచ్‌పైనే తమ ఫోకస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...
లీగ్ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న మీరు లివర్‌పూల్‌పై గెలిచి ఆధిక్యాన్ని చాటుకుంటారా?
అవును. ప్రస్తుత లక్ష్యమదే. మాకు ఈ మ్యాచ్‌కు ముందు చాలా విశ్రాంతి లభించింది. దీంతో తదుపరి మ్యాచ్‌లపై దృష్టి కేంద్రీకరించేందుకు సరైన సమయం దొరికింది. లివర్‌పూల్‌తో మ్యాచ్ తర్వాత సొంతగడ్డపై అర్సెనల్‌తో ఆడాల్సి ఉంది. దీంతో మాకు ఈ వారం చాలా కీలకమైంది.
ఇప్పటికే రేసులో ఉన్న మీరు టైటిల్‌పై ఆశలుపెట్టుకున్నారా? ఇప్పుడైతే మీరే ఈ టోర్నీలో పెద్ద ఫేవరెట్ కదా?
అలా ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పటికిప్పుడు మేం గ్రౌండ్‌లో మ్యాచ్‌లపైనే ఫోకస్ పెట్టాం తప్ప టైటిల్‌పై కాదు. మైదానంలో చెమటోడ్చడం ఆశించిన ఫలితాన్ని సాధించడమే మా ముందున్న లక్ష్యాలు. ముఖ్యంగా లివర్‌పూల్‌తో మ్యాచ్ అంత ఆషామాషీ కాదు. గట్టిపోటీ తప్పదనే అనుకుంటున్నా. మాకు గతంలో అక్కడ పెను సవాళ్లే ఎదురయ్యాయి.
గతవారం లివర్‌పూల్... స్వాన్‌సీ చేతిలో ఓడింది. మాంచెస్టర్, స్పర్స్ మ్యాచ్ డ్రా అయింది. ఇలాంటి తరుణంలో మీరి మ్యాచ్ గెలిస్తే మీకు తిరుగే లేదేమో?
నిజమే. ఇలాంటి ఫలితాలు జట్టుకు కలిసొస్తాయి. వీటిని అనుకూలంగా మలుచుకొని పైచేయి కొనసాగిస్తే చెప్పేదేముంటుంది. అయితే ఇది ఒక వారంతో ముగిసే ప్రక్రియ కాదు. నెలలకొద్దీ సాగే ఈ టోర్నీలో ఏవైనా జరగొచ్చు. మంచి ఫలితాలొస్తే ఎవరికైనా సంతోషమే. ఇది ఇలాగే కొనసాగాలని మాత్రం ఆశిద్దాం.
మాజీ సారథి జాన్ టెర్రీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన మీరు బాధ్యతలకు సిద్ధమేనా?
ఇలాంటి మేటి జట్టుకు కెప్టెన్ కావడం గర్వంగా ఉంది. కొన్నేళ్ల పాటు జాన్ టెర్రీ జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు. అతని వారసుడిగా జట్టును సమర్థంగా నడిపిస్తాననే విశ్వాసంతో ఉన్నాను.
టైటిల్‌పై కాదు... మ్యాచ్‌లపైనే మా దృష్టి
Published Tue, Jan 31 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
Advertisement
Advertisement