అల్విరో పీటర్సన్ పై నిషేధం
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్పై రెండేళ్ల పాటు నిషేధం పడింది. 2014-15 సీజన్లో జరిగిన దేశవాళీ లీగ్లో పీటర్సన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేల్చిన దక్షిణాఫ్రికా క్రికెట్.. అతనిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పీటర్సన్ పై దర్యాప్తు ముగిసిన తరువాత అతను మ్యాచ్ ఫిక్సర్ గా పేర్కొంటూ నిషేధం విధించింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురైన ఆరో క్రికెటర్ పీటర్సన్.
తాజాగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన అల్విరో పీటర్సన్.. దక్షిణాఫ్రికా తరపున 36 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే ఫిక్సింగ్ కు కేసులో నిషేధం ఎదుర్కొన్న తరువాత మరొక అత్యున్నత ప్రొఫెల్ కల్గిన దక్షిణాఫ్రికా క్రికెటర్ పై నిషేధం పడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం పీటర్సన్ వయసు 36 ఏళ్ల కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే. 2015 రామ్ స్లామ్ టోర్నీలో పలువురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. ఆ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి మిగతా క్రికెటర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పేర్కొంది.