గత జులైలో వెస్టిండీస్ చేతిలో నాలుగో వన్డేలో పరాజయం తర్వాత భారత్ మళ్లీ ఓడలేదు. విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాలపై కలిపి వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ ఏడాది జనవరి తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. విదేశీ గడ్డపై ఆడిన గత 11 వన్డేల్లో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. అద్భుత ఫామ్‌తో మన జట్టులో ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగుతుంటే... అటు కంగారూలు గెలవటం ఎలాగో మరచిపోయి బేలగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా పదో వన్డేలో విజయం సాధించి భారత్ తరఫున కొత్త రికార్డు నెలకొల్పాలని కోహ్లి సేన భావిస్తుండగా... సిరీస్ కోల్పోయాక పరువు కాపాడుకునే ప్రయత్నంలో స్మిత్ బృందం మరో పోరుకు సిద్ధమైంది.
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 925 వన్డేలు ఆడింది. కానీ ఎప్పుడూ వరుసగా పది మ్యాచ్‌లు గెలవలేదు. బంగ్లాదేశ్, జింబాబ్వే మినహా అగ్రశ్రేణి జట్లన్నీ ఈ ఫీట్‌ను కనీసం ఒక్కసారి అయినా నమోదు చేశాయి. ఆస్ట్రేలియా అయితే ఏకంగా ఆరు సార్లు వరుసగా పది మ్యాచ్‌లలో విజయం సాధించింది. భారత్ మాత్రమే ఈ ఘనత విషయంలో వెనుకబడి ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరే అవకాశం టీమిండియా ముందు నిలిచింది. ఆస్ట్రేలియాతో నేడు జరిగే నాలుగో వన్డేలో ఈ రికార్డు సృష్టించాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. సిరీస్‌ను 3–0తో ఇప్పటికే భారత్ సొంతం చేసుకోగా... కనీసం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి కాస్త పరువు దక్కించుకోవాలని ఆసీస్ భావిస్తోంది.
మార్పులు ఉంటాయా!
సిరీస్‌ను గెలుచుకున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనత ప్రదర్శించరాదన్నది కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి నుంచి చెప్పే మాట. శ్రీలంకతో సిరీస్‌లో కూడా జట్టు అంతే పట్టుదల ప్రదర్శించి క్లీన్‌స్వీప్ చేసింది. కాబట్టి ఆసీస్‌కు కూడా శూన్యహస్తం చూపిం చాలన్నదే భారత్ లక్ష్యం. కాబట్టి వరుస విజయాలు అందించిన కూర్పును మార్చే ప్రయత్నం మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. టాప్–3 రోహిత్, రహానే, కోహ్లి చక్కటి ఫామ్‌లో ఉండగా... ధోని, హార్దిక్ పాండ్యా లోయర్ ఆర్డర్‌లో సత్తా చూపిస్తున్నారు. ముఖ్యంగా పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత జట్టుకు విలువైన ఆస్తిగా మారింది. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. చివరి ఓవర్లలో వీరిద్దరూ ప్రమాదకరమైన జోడీ అని స్వయంగా ఆసీస్ కెప్టెన్ కితాబిచ్చారు. మరోసారి ఈ జంట తమ కచ్చితత్వంతో ప్రత్యర్థిని కట్టిపడేయగలదు. ఇక ఇద్దరు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను ఎదుర్కోవడం ఆసీస్ వల్ల కావడం లేదు. వీరిద్దరు కలిపి సిరీస్‌లో 13 వికెట్లు పడగొట్టారు. అక్షర్ తిరిగి జట్టులోకి వచ్చినా అతనికి అవకాశం కష్టమే. అయితే మిడిలార్డర్‌లో ఒక్క స్థానం విషయంలో మాత్రం మార్పుకు అవకాశం ఉంది. స్థానిక ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఆడించాలని భావిస్తే అతని కర్ణాటక సహచరుడు మనీశ్ పాండే లేదా కేదార్ జాదవ్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే తుది జట్టులో ఎవరున్నా జోరు మాత్రం తగ్గించరాదని భారత్ భావిస్తోంది.
గెలిపించేది ఎవరు?
ఫించ్ సెంచరీ కొట్టాడు, స్మిత్ బాగా ఆడాడు, వార్నర్ కూడా ఆకట్టుకున్నాడు. అయినా సరే ఆస్ట్రేలియా మాత్రం ఇండోర్‌లో గెలవలేకపోయింది. ఆ జట్టు నమ్ముకున్న ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించినా విజయం మాత్రం జట్టు దరి చేరలేదు. ఈ స్థితిలో అసలు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేదానిపైనే ఆస్ట్రేలియా గందరగోళంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ పిచ్‌పై కనీసం 300 పరుగులు కూడా చేయలేని ఆ జట్టు విజయాన్ని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అయితే ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టును బాగా దెబ్బ తీస్తోంది. హెడ్, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్ జట్టుకు ఉపయోగపడలేకపోతున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోలేని బలహీనతను ఆసీస్ అధిగమించలేకపోతోంది. గత మ్యాచ్‌లో ఎదురుదాడికి ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాధ్యం కాలేదు. అన్నింటికి మించి హిట్టర్ మ్యాక్స్‌వెల్ ఘోర వైఫల్యం కంగారూల పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏమాత్రం ఆలోచన లేకుండా గుడ్డిగా బ్యాట్ ఊపేస్తున్న అతని శైలి ఆసీస్‌ను నష్టపరిచింది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతను చహల్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా... అందులో రెండుసార్లు ఒకే తరహాలో వైడ్ బంతులకు స్టంపౌటయ్యాడు. బౌలింగ్‌లో కూల్టర్‌నీల్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తుండగా... మిగతా వారంతా విఫలమయ్యారు. లెగ్‌స్పిన్నర్ జంపా ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుత స్థితిలో ఆస్ట్రేలియా విజయం కోసం రెట్టింపు శ్రమించాల్సి ఉంది.
►100 వార్నర్‌కు ఇది 100వ వన్డే
► 42 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లికి ఈ మైదానంలో తిరుగులేని రికార్డు ఉన్నా... అంతర్జాతీయ వన్డేల్లో ఇక్కడ అతని ప్రదర్శన పేలవం. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి అతను మొత్తం 42 పరుగులు (0, 8, 34, 0) మాత్రమే చేశాడు.
పిచ్, వాతావరణం
చిన్నస్వామి స్టేడియం పిచ్‌లో మార్పుల అనంతరం ఇక్కడ తక్కువ స్కోర్లు నమోదవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ వన్డే జరుగుతోంది కాబట్టి వికెట్ స్పందించే తీరుపై ఇంకా స్పష్టత లేదు. 2013లో ఈ మైదానంలో ఆఖరి వన్డే జరిగింది. అదే మ్యాచ్‌లో ఆసీస్‌పై రోహిత్ 209 పరుగులు చేశాడు. గురువారం నగరంలో వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, మనీశ్ పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, హెడ్, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, కూల్టర్ నీల్, రిచర్డ్సన్, కమిన్స్/ఫాల్క్‌నర్, జంపా.