
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.
కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు.
యశస్వి జైస్వాల్‌పై వేటు
ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది.
మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదన
అదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్‌కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
కాగా ఈ సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.
రిషభ పంత్‌కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ
ఇక కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్‌ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం.
ఇంగ్లండ్‌తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
ఏది ఏమైనా ఇంగ్లండ్‌తో వన్డేలో సిరీస్‌లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్‌తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.
అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్‌లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment