బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో నాలుగో వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను 206 పరుగులకే కట్టడి చేశారు. అలీ 50 బంతుల్లో 67 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో షమీ మూడు, భువనేశ్వర్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన విజయం దిశగా దూసుకెళ్తోంది. 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె, ధవన్ బాధ్యతాయుత బ్యాటింగ్ తో రాణిస్తున్నారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. భువి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు హేల్స్, కుక్ను పెవలియన్ బాటపట్టించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువి హేల్స్ను బౌల్డ్ చేయగా, కుక్.. రైనాకు క్యాచిచ్చాడు. దీంతో ఇంగ్లీష్ మెన్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ షమీ ఆ వెంటనే బాలెన్స్ను అవుట్ చేసి ఇంగ్లండ్ కోలుకోనీకుండా చేశాడు. ఆ తర్వాత మోర్గాన్, రూట్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకట్ట వేసినా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. భారత బౌలర్లు మోర్గాన్, రూట్ ను వెంటవెంటనే అవుట్ చేశారు. ఆ తర్వాత అలీ మినహా ఇతర ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కుక్ సేన అతికష్టమ్మీద 200 పరుగుల మైలురాయి దాటింది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.