మారో... యూరో | France tournament from today | Sakshi
Sakshi News home page

మారో... యూరో

Published Thu, Jun 9 2016 11:07 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

మారో... యూరో - Sakshi

మారో... యూరో

ఫేవరెట్‌గా జర్మనీ
హ్యాట్రిక్‌పై స్పెయిన్ గురి
నేటి నుంచి ఫ్రాన్స్‌లో టోర్నీ
 

 
దశాబ్దాల కాలంగా యూరోపియన్ జట్లలో పేరుకు పెద్దదే అయినా... ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఒక్క యూరో టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. ప్రపంచాన్ని ఊపేసే స్టార్లు ఉన్నా పోర్చుగల్ ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. ఇక మాజీ చాంపియన్లు జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య నువ్వా, నేనా అనే స్థాయిలో చాలా కాలంగా పోటీ సాగుతుండగా... గత రెండు సార్లు స్పెయిన్ ఈ వేదికపై హవా నడిపించింది. ప్రపంచకప్ తర్వాత ఆ స్థాయి టోర్నీలో తమ సత్తా చాటేందుకు ఈ  జట్లకు మరో అవకాశం వచ్చింది. ప్రతిష్టాత్మక యూరో కప్ నేటి నుంచి జరుగుతుంది.

 
 సాక్షి క్రీడా విభాగం:- క్రిస్టియానో రొనాల్డో, వేన్ రూనీ... ఫుట్‌బాల్ ప్రపంచంలో స్టార్లుగా చెలామణీ అవుతున్నా ఇప్పటి వరకు తమ దేశం తరఫున చెప్పుకోదగ్గ టోర్నీ విజయంలో భాగం కాలేదు. అది ప్రపంచకప్ అయినా, దాదాపు అదే స్థాయిలో పోటీ ఉండే యూరో అయినా. ఇప్పుడు కెరీర్ చివరి దశలో వీరిద్దరు దానిని అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతిష్టాత్మక యూరో టోర్నీలో వారిలో ఎవరైనా దానిని సాధించగలరా, లేక మళ్లీ నిరాశతోనే కెరీర్‌ను ముగిస్తారా చూడాలి. 24 జట్లు పోటీ పడుతున్న యూరో కప్-2016 నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆరు గ్రూప్‌లలోని జట్లకు ఉన్న అవకాశాలు, అంచనాలను విశ్లేషిస్తే...


గ్రూప్ ఎ: ఫ్రాన్స్‌కే ఓటు
మాజీ చాంపియన్ ఫ్రాన్స్ ఈ గ్రూప్‌లో  ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సొంతగడ్డపై 2008లో కెప్టెన్‌గా జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన దీదియ ర్ డెస్‌చాంప్స్ ఇప్పుడు కోచ్‌గా ఉన్నాడు.   పోగ్బా, గ్రీజ్‌మన్, బ్లెయిజ్‌లతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్ దశకు చేరిన రికార్డు స్విట్జర్లాండ్‌కు ఉంది. అర్హత పోటీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా రొమేనియా క్వాలిఫై అయినా అంచనాలు లేవు. తొలి సారి ఆల్బేనియా యూరో బరిలోకి దిగుతోంది.


గ్రూప్ బి: ఇంగ్లండ్‌కు అవకాశం
కొత్త మేనేజర్ రాయ్ హడ్సన్ కుర్రాళ్లతో ఇంగ్లండ్ జట్టును నింపేశాడు. స్టార్ రూనీకి ఇది ఆఖరి అవకాశం. కుర్రాళ్లు బాగా ఆడుతుండటం, క్వాలిఫయింగ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఫామ్ ఇంగ్లండ్‌ను ఫేవరెట్‌లలో ఒకటిగా చేస్తున్నాయి. జట్టులో కోచ్ మొదలు ఆటగాళ్ల వరకు అంతర్గత సమస్యలతో ఉన్నందున రష్యా ప్రభావం చూపే అవకాశం లేదు. స్లొవేకియాకు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ గారెత్ బాలే అండగా ఉన్న వేల్స్ జట్టు తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉంది.


గ్రూప్ సి: రికార్డుపై జర్మనీ గురి
గతంలో ఫ్రాన్స్ మాత్రమే ప్రపంచకప్ తర్వాత యూరో గెలిచింది. ఇప్పుడు జర్మనీ దానిని సాధించడంతో పాటు నాలుగో సారి యూరో విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముల్లర్, పొడోల్‌స్కీ కీలక ఆటగాళ్లు. పోలండ్ డార్క్‌హార్స్‌గా ఆడనుంది. లెవాన్‌డోస్కీ టోర్నీలోనే బెస్ట్ సెంటర్‌ఫార్వర్డ్. ఉక్రెయిన్, నార్తర్న్, ఐర్లాండ్‌లనుంచి ఎలాంటి ప్రమాదం లేదు.


గ్రూప్ డి: స్పెయిన్ హ్యాట్రిక్ ఆశ
స్పెయిన్ టైటిల్ గెలిస్తే యూరోలో హ్యట్రిక్ సాధించిన తొలి జట్టు అవుతుంది. చివరి టోర్నీ ఆడుతున్న దిగ్గజం డెల్ బాస్క్యూకు గెలుపుతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న స్పెయిన్ ఫామ్‌లో ఉంది. కనీసం సెమీస్ చేరవచ్చు. గతంలో రెండు ప్రపంచకప్‌లలో క్వార్టర్స్ చేరిన క్రొయేషియా, టర్కీ, చెక్ రిపబ్లిక్ కూడా గట్టి పోటీనివ్వగలవు.


గ్రూప్ ఇ: బెల్జియంకు అవకాశం
స్టార్ ఆటగాళ్లంతా వరుసగా గాయాల బారిన పడటంతో టోర్నీకి ముందు బెల్జియంకు షాక్ తగిలింది.  ఆ జట్టు లుకాకు, డి బ్రూయిన్‌పై ఆధారపడుతోంది. 2012లో రన్నరప్ ఇటలీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయింది. క్వాలిఫయింగ్‌లో  10 మ్యాచ్‌లలో 16 గోల్స్ మాత్రమే చేసింది.   ఇబ్రహీమోవిచ్‌ను మినహాయిస్తే స్వీడన్  సున్నా.  రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌పై కూడా ఆశలు లేవు.

గ్రూప్ ఎఫ్: రొనాల్డోపైనే దృష్టి
కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న దశలో యూరోలో అడుగు పెడుతున్న రొనాల్డో ఈ సారైనా తన పూర్తి శక్తిసామర్థ్యాలు వినియోగించి పోర్చుగల్‌ను ముందంజలో నిలపాలని పట్టుదల గా ఉన్నాడు. స్ట్రైకర్ మార్క్ జంకోపై ఆస్ట్రియా ఆ శలు పెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో నెదర్లాం డ్స్‌ను ఓడించిన ఐస్‌లాండ్ మరో సంచలనం కోసం చూస్తుండగా, అదృష్టం కొద్దీ అర్హత సాధించిన హంగేరీ 1986 ప్రపంచకప్ తర్వాత తొలి టోర్నీ ఆడుతోంది.  
 
వింబుల్డన్‌కు నాదల్ దూరం

లండన్: మణికట్టు గాయంతో బాధపడుతున్న టెన్నిస్ స్టార్ నాదల్ వింబుల్డన్ ఆడటం లేదని ప్రకటించాడు. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో నాదల్ తప్పుకున్నాడు.
 
 
 నా మద్దతు జర్మనీకే
‘యూరోలో నేను జర్మనీ వైపు. మరి మీ మద్దతు ఎవరికి’ అని కోహ్లి జర్మనీ జెర్సీతో ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement