భారత్‌కు 14 పతకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు 14 పతకాలు గెల్చుకోవడంతోపాటు టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇందులో ఏడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.
ఈ టోర్నీలో ఒక్కో దేశం నుంచి ప్రతి వెయిట్ కేటగిరీలో గరిష్టంగా ఇద్దరు రెజ్లర్లు బరిలోకి దిగే అవకాశముంది. ఫ్రీస్టయిల్ విభాగంలోని మొత్తం ఏడు కేటగిరీల్లో భారత్‌కు పతకాలు రావడం విశేషం. సందీప్ తోమర్ (55 కేజీలు), జైదీప్ (60 కేజీలు), అమిత్ కుమార్ ధన్‌కర్ (66 కేజీలు), ప్రవీణ్ రాణా (74 కేజీలు), పవన్ కుమార్ (84 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు), జోగిందర్ కుమార్ (120 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. నరేందర్ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), నరేశ్ (84 కేజీలు), రోహిత్ పటేల్ (120 కేజీలు) రజత పతకాలు... అరుణ్ కుమార్ (66 కేజీలు), ప్రదీప్ (74 కేజీలు), హర్‌దీప్ (96 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. 1985లో మొదలైన కామన్వెల్త్ రెజ్లింగ్ పోటీలను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు.