praveen rana
-
ఆటగాళ్ల కోసం కొట్టుకున్న అభిమానులు
-
అభిమానుల డిష్యుం డిష్యుం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో స్థానం కోసం జరిపిన రెజ్లింగ్ పోటీలు రసాభాసగా సాగాయి. భారత్ తరపున సుశీల్ కుమార్, ప్రవీణ్ రాణాలు ఈ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు సన్నాహక మ్యాచ్ జరిగింది. ఇందుకోసం ఇరువురి అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియానికి తరలివచ్చారు. ఈపోటీలో గెలిచిన వారికే కామన్ వెల్త్ గేమ్స్ లో ఆడే అవకాశం లభిస్తుంది. ఓడిన వారు వెనుదిరగాలి. దీంతో ఇరువర్గాల అభిమానులు గొడవకు దిగారు. అక్కడున్న కుర్చీలు, బల్లలు విరగొట్టారు. దీంతో స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంతేకాకుండా సుశీల్ అభిమానులు ప్రవీణ్ రాణా సోదరుడుపై దాడికి దిగడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివాదంపై సుశీల్ కుమార్ స్పందించాడు. జరిగిన సంఘటనను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. అయితే గతంలో ప్రవీణ్ రాణా కూడా తన అభిమానుల్లాగే బౌట్లో ప్రవర్తించాడని విమర్శించాడు. నియమాలను వదిలేసి, కావాలనే కక్షపూరితంగా తనపై దాడిచేశాడని ఆరోపించాడు. అయినా తాను దీనిగురించి ఏమాత్రం బాధపడలేదని, ఆటలో ఇవన్నీ సర్వసాధారణం అన్నాడు. ఇప్పుడు ఈసమస్యకు కూడా పరస్పర అంగీకారంతోనే ఫుల్స్టాప్ పెడతామని సుశీల్ తెలిపాడు. గత కొద్ది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌ల్లో సుశీల్ కుమార్, ప్రవీణ్ రాణాను ఓడించాడు. అభిమానుల డిష్యుం డిష్యుం -
నర్సింగ్కు క్లియరెన్స్ వస్తే..!
న్యూఢిల్లీ: డోపింగ్ టెస్టులో పడిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై ఇంకా విచారణ కొనసాగుతోందని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) స్పష్టం చేసింది. దీనిలో భాగంగా నర్సింగ్ కు మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒకవేళ నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి నర్సింగ్ యాదవ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే అతన్ని రియోకు పంపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే నర్సింగ్ యాదవ్‌కు క్లియరెన్స్ వచ్చిన పక్షంలో అతన్ని పంపించాలా? లేదా? అనేది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుందన్నారు. 'ప్రస్తుతానికి 74 కేజీల విభాగంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాను పంపించేందుకు సిద్ధమయ్యాం. మరోవైపు నర్సింగ్ కేసును కూడా నాడా విచారిస్తోంది. అతనికి మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నారు. నర్సింగ్ కు క్లియరెన్స్ వచ్చి అతన్నే పంపాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ భావిస్తే ఆ రకంగానే చర్యలు తీసుకుంటాం. ఇందుకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐఓసీ అనేది కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాంటింది. మేము సదుపాయాల్ని సమకూర్చే వాళ్ల మాత్రమే. డబ్యూఎఫ్ఐ రానాను పంపాలని నిర్ణయించింది కాబట్టి ఆ సమాచారాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు తెలియజేశాం'అని రాజీవ్ మెహతా తెలియజేశారు. క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాకు రియోకు పంపేందుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. -
భారత జట్లకు నిరాశ
న్యూఢిల్లీ: ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ ఫ్రీస్టయిల్ గ్రూప్ ‘బి’ విభాగంలో భారత జట్టు 1-7తో అమెరికా చేతిలో; 0-8తో ఇరాన్ చేతిలో ఓడింది. అమెరికాతో జరిగిన ఎని మిది బౌట్లలో కేవలం 74 కేజీ విభాగంలో మాత్రమే టీమిండియా రెజ్లర్ ప్రవీణ్ రాణా 5-4తో అలెగ్జాండర్ డేవిడ్ డైరింగర్పై నెగ్గాడు. -
భజరంగ్‌కు రజతం
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు రెండు పతకాలతో మెరిశారు. గురువారం జరిగిన పురుషుల 61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్ 0-11తో మసూద్ ఎస్మెలీపోర్ (ఇరాన్) చేతిలో ఓడాడు. తద్వారా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. 97 కేజీల కేటగిరీలో సత్యవ్రత్ కడియాన్ 5-5తో అలియాన్ జుమేవ్ (కజకిస్థాన్)పై రెప్‌చేజ్‌లో నెగ్గి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 70 కేజీల కాంస్య పతక పోరులో అమిత్ కుమార్ డాకర్ 3-6తో కెన్ హోసాకా (జపాన్) చేతిలో; 74 కేజీల క్వార్టర్స్‌లో ప్రవీణ్ రాణా 9-10తో ఇంకోనెటివ్ (కిర్గిస్థాన్) చేతిలో ఓడారు. -
భారత్‌కు 14 పతకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు 14 పతకాలు గెల్చుకోవడంతోపాటు టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇందులో ఏడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్కో దేశం నుంచి ప్రతి వెయిట్ కేటగిరీలో గరిష్టంగా ఇద్దరు రెజ్లర్లు బరిలోకి దిగే అవకాశముంది. ఫ్రీస్టయిల్ విభాగంలోని మొత్తం ఏడు కేటగిరీల్లో భారత్‌కు పతకాలు రావడం విశేషం. సందీప్ తోమర్ (55 కేజీలు), జైదీప్ (60 కేజీలు), అమిత్ కుమార్ ధన్కర్ (66 కేజీలు), ప్రవీణ్ రాణా (74 కేజీలు), పవన్ కుమార్ (84 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు), జోగిందర్ కుమార్ (120 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. నరేందర్ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), నరేశ్ (84 కేజీలు), రోహిత్ పటేల్ (120 కేజీలు) రజత పతకాలు... అరుణ్ కుమార్ (66 కేజీలు), ప్రదీప్ (74 కేజీలు), హర్దీప్ (96 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. 1985లో మొదలైన కామన్వెల్త్ రెజ్లింగ్ పోటీలను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు.