నర్సింగ్కు క్లియరెన్స్ వస్తే..!
న్యూఢిల్లీ: డోపింగ్ టెస్టులో పడిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్పై ఇంకా విచారణ కొనసాగుతోందని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) స్పష్టం చేసింది. దీనిలో భాగంగా నర్సింగ్ కు మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒకవేళ నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి నర్సింగ్ యాదవ్కు అనుకూలంగా నిర్ణయం వస్తే అతన్ని రియోకు పంపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే నర్సింగ్ యాదవ్కు క్లియరెన్స్ వచ్చిన పక్షంలో అతన్ని పంపించాలా? లేదా? అనేది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుందన్నారు.
'ప్రస్తుతానికి 74 కేజీల విభాగంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాను పంపించేందుకు సిద్ధమయ్యాం. మరోవైపు నర్సింగ్ కేసును కూడా నాడా విచారిస్తోంది. అతనికి మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నారు. నర్సింగ్ కు క్లియరెన్స్ వచ్చి అతన్నే పంపాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ భావిస్తే ఆ రకంగానే చర్యలు తీసుకుంటాం. ఇందుకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐఓసీ అనేది కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాంటింది. మేము సదుపాయాల్ని సమకూర్చే వాళ్ల మాత్రమే. డబ్యూఎఫ్ఐ రానాను పంపాలని నిర్ణయించింది కాబట్టి ఆ సమాచారాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్కు తెలియజేశాం'అని రాజీవ్ మెహతా తెలియజేశారు.
క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాకు రియోకు పంపేందుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే.