'సీబీఐ విచారణ జరగాల్సిందే'
రియో డీ జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై డోపింగ్ కుట్ర జరిగిందని బలంగా వాదిస్తున్న డబ్యూఎఫ్ఐ(రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా).. ఈ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ జరగాల్సేందనని డిమాండ్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు వెలికి రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్లిన నర్సింగ్ యాదవ్ ఆశలకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో బ్రేక్ పడింది. దాంతో పాటు అతనిపై నాలుగేళ్ల నిషేధం కూడా విధించింది. నర్సింగ్ పై డోపింగ్ కుట్ర జరిగిందనడానికి బలమైన ఆధారాలు లేనందును అతనిపై సస్పెన్షన్ వేటూ వేస్తూ తీర్పు వెలువరించింది.
జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు. కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) తన అధికారం మేరకు సీఏఎస్ లో సవాల్ చేసింది. దీనిపై విచారణకు స్వీకరించిన సీఏఎస్.. నర్సింగ్ కుట్ర కారణంగానే డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఉదంతం డోపింగ్ కుట్రలో భాగమేనని డబ్యూఎఫ్ఐ భావిస్తోంది.