'నర్సింగ్ వివాదంలో ఏమీ చేయలేం'
న్యూఢిల్లీ:డోపింగ్ టెస్టుల్లో విఫలమైన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం లేనట్లే కనబడుతోంది. ఈ వ్యవహారంలో తాము ఏమీ చేయలేమని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటనతో నర్సింగ్ ఒలింపిక్స్ కు వెళ్లేది అనుమానంగా మారింది. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడటమనేది న్యాయపరమైన అంశమైనందున ఇందులో ఎవరికీ తలదూర్చే అవకాశమే లేదని క్రీడా మంత్రి విజయ్ గోయెల్ తెలిపారు.
'నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ(నాడా) అనేది క్రమశిక్షణా సంఘం. డోపింగ్ కేసుల్లో ఆ ఏజెన్సీదే ప్రముఖ పాత్ర. ఈ విషయంలో నర్సింగ్ తన సచ్ఛీలతను అక్కడే నిరూపించుకోవాలి. మేము చేసేది ఏమీ లేదు' అని విజయ్ గోయెల్ అన్నారు. అయితే తనను కుట్ర పూరితంగా ఇరికించారని ఆరోపిస్తున్న నర్సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై గోయెల్ దాటవేత ధోరణి అవలంభించారు. ఆ విషయం తమకు తెలియదన్నారు. దానికి సంబంధించి నర్సింగ్ తమతో ఏమీ చెప్పలేదని బదులిచ్చారు.
నర్సింగ్ కు అండగా ఉంటాం
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ అవకాశాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ) వాదిస్తోంది. కుట్ర పూరిత చర్యలో భాగంగానే నర్సింగ్ యాదవ్ ఆహారంలో నిషేధిత డ్రగ్స్ కలపారనే అనుమానం వ్యక్తం చేసిన డబ్యూఎఫ్ఐ.. అతనికి పూర్తి స్థాయిలో న్యాయపరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఒక అతి పెద్ద కుట్రలో బాధితుడైన నర్సింగ్ కు ఇప్పుడు మద్దతుగా నిలవడమే తమ కర్తవ్యమని తెలిపింది.
'నర్సింగ్ యాదవ్పై పూర్తి నమ్మకం ఉంది. అతను అమాయకుడు. అతనిపై కక్ష గట్టే ఎవరో డ్రగ్స్ను ఆహారంలో కలిపారు. నర్సింగ్కు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ సమస్య నుంచి నర్సింగ్ను బయట తీసుకొచ్చేందుకు మా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం. ఇంకా నర్సింగ్ రియో అవకాశాలు మూసుకుపోలేదు. భారత్ నుంచి రెజ్లింగ్ 74 కేజీల విభాగంలో నర్సింగ్ వెళతాడు. ఈ విషయంలో మాకు అపారమైన నమ్మకం ఉంది. రియోకు వెళ్లడమే కాదు.. పతకం కూడా సాధిస్తాడు' అని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ తెలిపారు.
మరోవైపు డబ్యూఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ అసిత్ సాహా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అతని రెండు శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చిన తరుణంలో ఒలింపిక్స్ కు వెళ్లే అవకాశం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఒలింపిక్స్ లో భాగంగా ఏర్పాటైన ఒక కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తుందన్నారు. ఆ కమిటీ తీసుకునే తుది నిర్ణయంపై నర్సింగ్ రియో భవితవ్యం ఆధారపడి వుంటుందన్నారు. దీనిలో భాగంగా నర్సింగ్ కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అసిత్ సాహా తెలిపారు.