విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ అందించకున్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ).. కెప్టెన్ విరాట్ కోహ్లిపై నమ్మకం ఉంచిందని, అందుకు అతను ఆర్సీబీకి కృతజ్ఞతలు తెలపాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఓ చానెల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌లో కోహ్లికి చాలా భవిష్యత్ ఉంది. ఆర్సీబీ టైటిల్ విన్నర్‌గా నిలవలేనంత మాత్రాన అతని కెప్టెన్సీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ధోని, రోహిత్‌శర్మ మూడుసార్లు ఆయా జట్లను విజేతగా నిలిపారు. ఇలాంటి సమయంలో కోహ్లిని వారితో పోల్చవద్దు. గత ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్ గెలవలేకపోతోంది. అయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకముంచింది.
ఇది కోహ్లి అదృష్టం. అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి అతడు కృతజ్ఞత తెలపాలి. ఐపీఎల్‌లో విజేతలుగా నిలిస్తేనే కెప్టెన్లకు గౌరవం ఉంటుంది. అలా నిలవలేనివారు ఎంతో మంది జట్లు మారతున్నారు. అయినా కోహ్లిపై నమ్మకంతో ఆర్సీబీ యాజమాన్యం కొనసాగిస్తోంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కీలక మ్యాచ్‌ల్లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లనే ఆర్సీబీ టైటిల్ అందుకోలేకపోయిందని కొద్ది రోజుల క్రితం కోహ్లి పేర్కొన్న విషయం తెలిసిందే. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య చెన్నై మ్యాచ్‌తో ఐపీఎల్-12 సీజన్‌కు తెరలేవనుంది.
Comments
Please login to add a commentAdd a comment