న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమ్ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. గంభీర్ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు తన సామర్థ్యం సరిపోవడం లేదని గంభీర్ వెల్లడించాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని, మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని అతను స్పష్టం చేశాడు.
‘పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలోనే ప్రమాద ఘంటిక మోగింది. నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయం అనిపించింది. నా ప్రదర్శన కూడా ఏమీ బాగా లేదు. నేను ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాను. బహుశా జట్టు పరిస్థితిని మార్చడం గురించి చాలా ఎక్కువగా ఆలోచించానేమో. ఫ్రాంచైజీ నన్ను తప్పుకోమని కోరలేదు. నా ఇష్ట్రపకారమే కెప్టెన్సీని వదిలేస్తున్నా. జట్టు కంటే ఎవరూ ఎక్కువ కాదు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి ఐదు ఓడింది. పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో 55 పరుగులు చేసిన అనంతరం గంభీర్... తర్వాతి 4 ఇన్నింగ్స్‌లలో వరుసగా 15, 8, 3, 4 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మొత్తం 85 పరుగులను అతను కేవలం 96.59 స్ట్రయిక్ రేట్‌తో చేయడం కూడా జట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది.
36 ఏళ్ల గంభీర్ 2008 నుంచి 2010 వరకు డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను 2012, 2014లలో జట్టును విజేతగా నిలిపాడు. ఈ సీజన్‌లో మళ్లీ సొంత జట్టుకు తిరిగొచ్చిన అతను... కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి డేర్‌డెవిల్స్ రాత మార్చగలనని నమ్మాడు. అయితే గంభీర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. 2012 ఐపీఎల్ సీజన్ నుంచి చూస్తే ఆరో స్థానంలో నిలవడమే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. అయితే గంభీర్ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపదని, మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలో రాణించి ముందుకు వెళ్లగల సత్తా తమకుందని కోచ్ పాంటింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
రూ. 2.8 కోట్లు వెనక్కి...
టీమ్ పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్‌గా తప్పుకున్న గంభీర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు వేలంలో దక్కిన రూ. 2.8 కోట్లను ఫ్రాంచైజీకి తిరిగి ఇచ్చేయాలని అతను భావిస్తున్నాడు. అదే జరిగితే పేలవ ప్రదర్శనకుగాను ఐపీఎల్‌లో డబ్బులు వెనక్కి ఇచ్చిన తొలి ఆటగాడు గంభీరే అవుతాడు. ‘ఈ సీజన్‌లో ఫ్రాంచైజీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని గంభీర్ నిర్ణయించుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌లను అతను ఉచితంగానే ఆడతానని చెప్పాడు. అతనికి డబ్బుకంటే పరువు ప్రతిష్టలే ముఖ్యం. ఇది అతని సొంత నిర్ణయం’ అని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని కూడా గంభీర్ స్పష్టం చేశాడు.
మొదటిసారేమీ కాదు...
ఐపీఎల్‌లో వ్యక్తిగత ప్రదర్శన బాగా లేకపోవడం వల్ల గానీ, జట్టు వైఫల్యాల కారణంగా కానీ లీగ్ మధ్యలో కెప్టెన్లు తప్పుకోవడం ఇది మొదటి సారేమీ కాదు. గతంలోనూ పలువురు సారథులు ఈ తరహాలో సొంత నిర్ణయాలు తీసుకోగా, మరికొందరిని ఫ్రాంచైజీలే మార్చేశాయి. వాటిని చూస్తే...
వీవీఎస్ లక్ష్మణ్ స్థానంలో గిల్‌క్రిస్ట్ (దక్కన్ చార్జర్స్–2008)
కెవిన్ పీటర్సన్ స్థానంలో అనిల్ కుంబ్లే (బెంగళూరు–2009)
వెటోరి స్థానంలో విరాట్ కోహ్లి (బెంగళూరు–2012)
సంగక్కర స్థానంలో కామెరాన్ వైట్ (దక్కన్ చార్జర్స్ –2012)
పాంటింగ్ స్థానంలో రోహిత్ (ముంబై ఇండియన్స్–2013)
శిఖర్ ధావన్ స్థానంలో డారెన్ స్యామీ (సన్‌రైజర్స్–2014)
షేన్ వాట్సన్ స్థానంలో స్టీవ్ స్మిత్ (రాజస్తాన్–2015)
మిల్లర్ స్థానంలో మురళీ విజయ్ (పంజాబ్–2016)
Comments
Please login to add a commentAdd a comment