మీడియాతో గౌతం గంభీర్, శ్రేయస్ అయ్యర్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు గంభీర్ ప్రకటించాడు. కాగా, గంభీర్ స్థానంలో కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
గంభీర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం. జట్టుకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాను. జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. కెప్టెన్‌గా దిగిపోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. శ్రేయస్ అయ్యర్ నూతన కెప్టెన్‌గా ఢిల్లీ డేర్‌డెవిల్స్ బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడికి నా సహకారం ఎప్పటికీ ఉంటుందని’ భావోద్వేగానికి లోనయ్యాడు.
గత ఏడేళ్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. ఆ జట్టును రెండు పర్యాయాలు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఢిల్లీ జట్టుతోనే ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన గౌతీ.. ఈ సీజన్‌లో మళ్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్నాడు. 6 మ్యాచ్‌లాడిన గంభీర్ కేవలం 85 పరుగులే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 96.59 ఉండటం గమనార్హం. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ గంభీర్ కెప్టెన్సీ వదులుకున్నాడు.
6 మ్యాచ్‌లాడిన ఢిల్లీ కేవలం ఒక్క గెలుపుతో రెండు పాయింట్లు సాధించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి (8వ) స్థానంలో నిలిచింది. ముంబై ఖాతాలోనూ రెండే పాయింట్లు ఉండగా మెరుగైన రన్‌రేట్‌తో రోహిత్ సేన ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment