
కోల్‌కతా అలవోకగా..
9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్
రాణించిన చావ్లా, ఉతప్ప
సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పంజాబ్‌కు బ్రేక్ పడింది. సెహ్వాగ్ రాణించినా... మిల్లర్, మ్యాక్స్‌వెల్ విఫలం కావడంతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. సీజన్‌లో పంజాబ్‌కు ఇది కేవలం రెండో ఓటమి మాత్రమే.
కటక్: ప్లే ఆఫ్ రేసులో వెనకబడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలకమైన సమయంలో పుంజుకుంది. బౌలింగ్‌లో పీయూష్ చావ్లా (3/19), మోర్నీ మోర్కెల్ (2/20)... బ్యాటింగ్‌లో గంభీర్ (45 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు), ఉతప్ప (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో... కోల్‌కతా 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసి, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సెహ్వాగ్ (50 బంతుల్లో 72; 11 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించినా... కోల్‌కతా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను దెబ్బ తీశారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 150 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గంభీర్, ఉతప్పలతో పాటు మనీష్ పాండే (35 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బ్యాట్స్‌మెన్ వైఫల్యం
ఏడో సీజన్‌లో పంజాబ్‌కు శుభారంభాలు అందిస్తున్న సెహ్వాగ్ మరోసారి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. కలిస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో వీరూ నాలుగు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఓవర్‌లో పంజాబ్‌కు తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (0)ను మోర్నీ మోర్కెల్ అవుట్ చేశాడు.
ఉన్నంతసేపు దడదడలాడించిన సాహా (15), మోర్కెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక సెహ్వాగ్ తన వ్యక్తిగత స్కోరు 23 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్కోరు నెమ్మదించినా.. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 49 పరుగులు చేసింది.
జోరుమీదున్న సెహ్వాగ్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తన సహజ ఆటతీరుకు భిన్నంగా ఆడిన మ్యాక్స్‌వెల్ (14)ను చావ్లా డగౌట్‌కి పంపాడు.
చకచక రెండు ఫోర్లు కొట్టి సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో సెహ్వాగ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మిల్లర్ (13), రిషి ధావన్ (4) వెనువెంటనే అవుటవడంతో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. నరైన్ వేసిన చివరి ఓవర్‌లో మిచెల్ జాన్సన్ (14) ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టి పంజాబ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
అదిరిపోయే ఆరంభం
లక్ష్యఛేదనను కోల్‌కతా నెమ్మదిగా మొదలుపెట్టినా ఆ తర్వాత దూకుడు పెంచింది. ముఖ్యంగా ఉతప్ప చెలరేగిపోయాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు, మిచెల్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ సిక్స్, మూడు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కెప్టెన్ గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాక ఉతప్ప అవుటయ్యాడు.
ఉతప్ప అవుటైనా... గంభీర్, మనీష్ పాండే జోరు కొనసాగించారు. దీంతో 12వ ఓవర్‌లో కోల్‌కతా స్కోరు వంద దాటింది. ఫామ్‌లో ఉన్న గంభీర్ ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. పాండేతో కలిసి గంభీర్ పంజాబ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజ యాన్ని అందించాడు. రెండో వికెట్‌కు గంభీర్, పాండే అజేయంగా 82 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) చావ్లా 72; మన్‌దీప్ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 0; సాహా (బి) మోర్కెల్ 15; మ్యాక్స్‌వెల్ (సి) మోర్కెల్ (బి) చావ్లా 14; మిల్లర్ (బి) ఉమేశ్ 13; బెయిలీ నాటౌట్ 12; రిషి (బి) చావ్లా 4; మిచెల్ జాన్సన్ (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 14; అక్షర్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-17; 2-48; 3-87; 4-112; 5-120; 6-127; 7-148; 8-149.
బౌలింగ్: కలిస్ 3-0-38-0; మోర్నీ మోర్కెల్ 4-0-20-2; ఉమేశ్ 4-0-34-1; నరైన్ 4-0-30-1; చావ్లా 4-0-19-3; డస్కాటే 1-0-6-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) అక్షర్ (బి) అవానా 46; గంభీర్ నాటౌట్ 63; మనీష్ పాండే నాటౌట్ 36; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో 1 వికెట్‌కు) 150.
వికెట్ల పతనం: 1-68.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-32-0; మిచెల్ జాన్సన్ 3-0-33-0; అక్షర్ 4-0-20-0; అవానా 2-0-20-1; రిషి 4-0-32-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0.
ఎన్నాళ్లకెన్నాళ్లకు
వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు ఐపీఎల్‌లో అర్ధసెంచరీ చేశాడు. గత సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడిన వీరూ ముంబైపై 95 పరుగులు చేసిన తర్వాత... ఆ సీజన్‌లో, ప్రస్తుత సీజన్‌లో కలిసి వరుసగా 17 మ్యాచ్‌ల పాటు అర్ధసెంచరీ చేయలేదు. ఈ సీజన్‌లో 20లు, 30లు కొట్టినా అర్ధసెంచరీ మార్కు ఊరిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు కరవు తీర్చుకున్నాడు.