
ప్రస్తుతం దృష్టంతా ఐపీఎల్‌పైనే!
భారత జట్టులో పునరాగమనంపై గంభీర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తన దృష్టంతా లీగ్‌పైనే అని చెప్పాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటనతో పాటు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ గురించి తాను ఆలోచించడం లేదని వివరించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం తాను చక్కగా ఆడుతున్నానని, తనను విమర్శించే వారికి తన ఆటతీరే జవాబు అని అన్నాడు. ‘నేను ఇప్పుడు ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టా. కోల్‌కతా తరఫున బాగా ఆడుతున్నా. ఈ టోర్నీలో నా ప్రదర్శన బాగుంటే భారత సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకుంటారు’ అని గంభీర్ చెప్పాడు.
ఇక వరుస విజయాలతో కోల్‌కతా ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతోంది. ఇదే జోరును మున్ముందు కొనసాగిస్తే మరోసారి చాంపియన్‌గా నిలవడం పెద్ద కష్టమేమీ కాదని గంభీర్ అన్నాడు. ‘ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌పై దృష్టిపెట్టాం. ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాం. సీనియర్లు, యువకులతో మా జట్టు సమతూకంగా ఉంది. మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది’ అని గంభీర్ చెప్పాడు.