వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్
ముంబై: భారత జట్టుకు ఒకప్పుడు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆ ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. కుర్రాళ్ల జోరుతో టీమిండియాలో స్థానం కోల్పోవడంతో వారి క్రికెట్ భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ భారత జట్టులో తమ పునరాగమనాన్ని ఆశిస్తున్నా వారి ప్రయత్నాలు ఫలితాన్నివ్వడంలేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఈ ఇద్దరి ఆటను విశ్లేషించారు. వారికి పూర్తిగా తలుపులు మాసుకుపోలేదని, తీవ్రంగా శ్రమిస్తే తిరిగి జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. క్రికెట్‌లో ఏదీ అసాధ్యం కాదనే విషయాన్ని గుర్తెరిగి వారు పట్టుదల ప్రదర్శించాలని అన్నారు.
సెహ్వాగ్‌పై...: ఫామ్‌ను తిరిగి అంది పుచ్చుకునే క్రమంలో సెహ్వాగ్ ఈ ఏడాది రంజీల్లో మిడిలార్డర్‌కు మారాడు. దాదాపు దశాబ్దంపాటు అతడిని శిఖరంపై నిలబెట్టిన ఓపెనింగ్ వదిలి ఆర్డర్‌ను మార్చాడు. అయితే అదీ ఫలితాన్ని ఇవ్వలేదు. తన ఢిల్లీ సహచరుడు ఆశిష్ నెహ్రాకంటే అతను తక్కువగా బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు. వీరూ మళ్లీ టాపార్డర్‌లో ఆడటమే దీనికి పరిష్కారమని సన్నీ అన్నారు. ‘క్రికెట్‌లో ఏదీ అసాధ్యం కాదని వీరూ గుర్తించాలి.
సాధారణ సెంచరీలతో సరిపెట్టకుండా కనీసం డబుల్ సెంచరీలాంటి భారీ స్కోర్లు చేయాలి. బంతి బ్యాట్‌పై నేరుగా రావడాన్ని సెహ్వాగ్ ఇష్ట పడతాడు. కొత్త బంతిని ఎదుర్కున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఇన్నేళ్లు ఓపెనర్‌గా ఆడి ఇప్పుడు తన వంతు కోసం డ్రెస్సింగ్ రూమ్‌లో వేచి చూడటం ఎవరికైనా కష్టమే. ఇప్పుడు వీరూ చేయాల్సిందల్లా మళ్లీ ఆర్డర్ మారడమే’ అని ఈ దిగ్గజ క్రికెటర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
యువరాజ్‌సింగ్‌పై...: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన యువరాజ్, ఆ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో కూడా విఫలమయ్యాడు. ఆడిన మూడు రంజీ ట్రోఫీ మ్యాచుల్లో కూడా ఆకట్టుకోలేదు. అయితే ఒక అద్భుత సీజన్ ఆటగాడి కెరీర్‌ను నిలబెట్టగలదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘ఇంకా ఆడగలిగే పట్టుదల, ఆ ఉత్సాహం తనలో మిగిలే ఉన్నాయనే విషయాన్ని యువరాజ్ ఇప్పుడు స్వయంగా నిరూపించుకోవాలి.
అది యువీలో ఉందని నా నమ్మకం. అతను ఒక్క సీజన్‌లోనే విఫలమయ్యాడు. అతని అవసరం ఇంకా భారత జట్టుకు ఉంది కాబట్టి తిరిగి రాగలడనే అనుకుంటున్నా. ఇప్పటికీ అతను మంచి స్పిన్నర్, అద్భుత ఫీల్డర్ కూడా’ అని సన్నీ విశ్లేషించారు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో భారత క్రికెటర్లు ఆడి ఉంటే బాగుండేదన్న రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలకు గవాస్కర్ కూడా మద్దతు పలికారు. ఆ ఆటగాళ్లు ఒకరోజు ఆలస్యంగా బయల్దేరితే సరిపోయేదన్నారు.