గావస్కర్- సెహ్వాగ్
IPL 2023: సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి జూనియర్లే ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆటలో మెలకువలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలని.. తన కెరీర్ తొలినాళ్లలో దిగ్గజం సునిల్ గావస్కర్‌తో మాట్లాడేందుకు విశ్వప్రయత్నం చేశానని పేర్కొన్నాడు.
దూసుకుపోతున్న గిల్
కానీ.. టీమిండియా యువ ఓపెనర్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌కు మాత్రం ఇలాంటి లక్షణాలు లేవని చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గిల్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 576 పరుగులు చేశాడు.
షా ఇప్పుడిలా
ఇదిలా ఉంటే.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన గిల్ సమకాలీకుడు పృథ్వీ షా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ముంబై బ్యాటర్ ఆరంభంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు.
ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి తుది జట్టులో స్థానం సంపాదించిన అతడు.. తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. వార్నర్‌కు జోడీగా ఓపెనింగ్ చేసిన అతడు 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు రాబట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 101 పరుగులు(7 ఇన్నింగ్స్) చేసిన అతడికి ఇదే అత్యధిక స్కోరు.
నాతో యాడ్ షూట్ చేసినపుడు
ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘పృథ్వీ షా నాతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. శుబ్‌మన్ గిల్ కూడా అక్కడే ఉన్నాడు. మేమంతా దాదాపు ఆరు గంటల పాటు అక్కడే ఉన్నాం. వారిద్దరిలో ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడలేదు.
నేనైతే టీమిండియాకు ఆడుతున్న కొత్తలో సన్నీ భాయ్(గావస్కర్)తో మాట్లాడటానికి చేయని ప్రయత్నం లేదు. ఓ రోజు జాన్‌రైట్ దగ్గరకు వెళ్లి.. ‘‘నేను కొత్త ప్లేయర్‌ని.. సన్నీ భాయ్ నాతో మాట్లాడతారో లేదో తెలియదు. కానీ నేను మాత్రం ఎలాగైనా ఆయనను కలవాలని అనుకుంటున్నానని చెప్పాను.
గావస్కర్ నన్ను కలవాలనుకోడు.. నేనే వెళ్లాలి!
కాబట్టి ఎలాగైనా మీటింగ్ ఏర్పాటు చేయమని కోరాను. ఓ రోజు రైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. 2003-04లో నా ఓపెనింగ్ పార్ట్‌నర్ ఆకాశ్ చోప్రా. తను కూడా నాతో కలిసి సన్నీ భాయ్ దగ్గరకు వచ్చాడు. మేమిద్దరం కలిసి డిన్నర్ చేస్తూ బ్యాటింగ్ ఎలా చేయాలన్న అంశం గురించి ఆయనతో చర్చించాం.
మనకు ఏదేని విషయం పట్ల ఆసక్తి ఉండాలి. అందుకోసం మనమే రంగంలోకి దిగాలి. సునిల్ గావస్కర్ వచ్చి సెహ్వాగ్ లేదంటే చోప్రాతో మాట్లాడాలని అనుకోరు. మనమే ఆయన దగ్గరకు వెళ్లాలి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సీనియర్లు అందుబాటులో ఉన్నపుడు వారితో చర్చిస్తే ఆటలో మెలకువలు తెలుసుకునే వీలుంటుందని.. అలాకాక సీనియర్లే తమకు దగ్గరకు వస్తారని ఆశించడం సరికాదని పరోక్షంగా షా, గిల్‌లకు చురకలు అంటించాడు.
వీరూ భాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘షా, గిల్‌ల ప్రవర్తనతో ముల్తాన్ సుల్తాన్‌కు బాగా కోపం వచ్చినట్లుంది. అయినా భాయ్ చెప్పిందే కరెక్టే కదా! సీనియర్లు జూనియర్ల దగ్గరికి రారు. జూనియర్లే వెళ్లాలి. ఇప్పటికైనా అర్థమైందా షా, గిల్?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఈజీ క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్ యాదవ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment