IPL 2023, DC VS GT: Virender Sehwag Furious Lashes Out Prithvi Shaw After Poor Shot - Sakshi
Sakshi News home page

DC Vs GT: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! యువ ఓపెనర్‌పై సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు

Published Wed, Apr 5 2023 10:11 AM | Last Updated on Wed, Apr 5 2023 10:55 AM

IPL 2023 DC VS GT: Sehwag Furious Lashes Out Prithvi Shaw After Poor Shot - Sakshi

వీరేంద్ర సెహ్వాగ్‌

2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సమయంలో.. ‘‘వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రియన్‌ లారా, సచిన్‌ టెండుల్కర్‌’’ వంటి స్టార్‌ బ్యాటర్ల సరసన చేరే సత్తా కలిగిన వాడు ఈ యంగ్‌స్టర్‌... జాతీయ జట్టుకు ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ(134) సాధించిన సమయంలో ముంబై బ్యాటర్‌ పృథ్వీ షాను ఉద్దేశించి టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి.

కానీ ప్రస్తుతం ఈ ‘స్టార్‌ బ్యాటర్‌’ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా టీమిండియాలో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అదే సమయంలో పృథ్వీ సారథ్యంలో అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆడిన మరో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాత్రం భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు.

మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలతో చెలరేగుతూ టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసే పనిలో ఉన్నాడు. అదే విధంగా ఫ్రాంఛైజీ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌లో గిల్‌ సభ్యుడు. 

తమ జట్టును టైటిల్‌ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ పంజాబీ బ్యాటర్‌ ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆరంభ మ్యాచ్‌లోనూ దంచికొట్టాడు. అద్భుతమైన అర్ధ శతకం(63)తో ఐపీఎల్‌ పదహారో సీజన్‌ ఆరంభించాడు.

ఒక్కసారి వాళ్లను చూడు
కానీ పృథ్వీ షా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే పెవిలియన్‌ చేరిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌.. రెండో మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అది కూడా చెత్త షాట్‌ సెలక్షన్‌తో!

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. పృథ్వీ షా ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. తన తోటి ఆటగాళ్లు గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ పరుగుల వరద పారిస్తూ దూసుకుపోతుంటే షా మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాడని, షాట్ల ఎంపిక విషయంలో తప్పులు చేస్తున్నాడంటూ చురకలు అంటించాడు.

గుణపాఠాలు నేర్చుకోవడం లేదు
ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చెత్త షాట్లతో ఇప్పటికే చాలా సార్లు వికెట్‌ సమర్పించుకున్నాడు. కానీ తప్పుల నుంచి గుణపాఠాలు మాత్రం నేర్చుకోలేకపోతున్నాడు. అదే శుబ్‌మన్‌ గిల్‌ను చూడండి.. షా కెప్టెన్సీలో అండర్‌-19 క్రికెట్‌ ఆడిన వాడే కదా.. తను మాత్రం ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. 

అంతేకాదు ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. మరోవైపు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపీఎల్‌లో 600కు పైగా పరుగులు చేసి ఆరెంజ్‌ ​క్యాప్‌ గెలిచాడు. శుబ్‌మన్‌ గిల్‌ కూడా మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కానీ షా ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు’’ అని సెహ్వాగ్‌.. పృథ్వీ షా ఆట తీరును విమర్శించాడు. కాగా గుజరాత్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో పృథ్వీ.. మహ్మద్‌ షమీ ట్రాప్‌లో చిక్కి అల్జారీ జోసెఫ్‌నకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

చదవండి: DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌తో పాటు టీమిండియాలో కూడా!
ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వరల్డ్‌కప్‌ టోర్నీకి కూడా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement