DC Vs GT: ఓడినా సంతృప్తిగానే ఉంది.. కానీ: శుబ్‌మన్‌ గిల్‌ | No Point In Talking: Gill Blunt Response After GT Loss Vs DC IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024 DC Vs GT: ఓడినా సంతృప్తిగానే ఉంది.. కానీ: శుబ్‌మన్‌ గిల్‌

Published Fri, Apr 26 2024 12:46 PM | Last Updated on Fri, Apr 26 2024 12:46 PM

No Point In Talking: Gill Blunt Response After GT Loss Vs DC IPL 2024 - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడినా ఆఖరి వరకు తాము పట్టుదలగా పోరాడిన తీరు సంతృప్తినిచ్చిందని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు. చివరి వరకు తాము గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నామని అయితే.. దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేశాడు. 

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ బుధవారం ఢిల్లీతో తలపడింది. అరుణ్‌ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో ఏకంగా 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(43 బంతుల్లో 66) సైతం బ్యాట్‌ ఝులిపించాడు. ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (7 బంతుల్లో 26*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

అయితే, మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా(39), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌(39 బంతుల్లో 65) ఇన్నింగ్స్‌ చక్కదిద్దగా.. డేవిడ్‌ మిల్లర్‌(23 బంతుల్లో 55) ధనాధన్‌ దంచికొట్టి టైటాన్స్‌ శిబిరంలో ఆశలు రేపాడు. 

అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో దిగిన రషీద్‌ ఖాన్‌(11 బంతుల్లో 21*) పట్టుదలగా నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో టైటాన్స్‌ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4,4,(0), (0), 6 రాబట్టాడు.

ఈ క్రమంలో ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. రషీద్‌ పరుగు తీయలేకపోయాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ గుజరాత్‌పై జయభేరి మోగించింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మేము చాలా బాగా ఆడాం. అయితే, ఓడిపోవడం మాత్రం బాధగానే ఉంది. అయినా.. పట్టుదలగా ఆఖరి వరకు పోరాడినందుకు సంతృప్తిగా ఉంది.

అసలు మాకు ఓటమి ఎదురవుతుందని ఏ దశలోనూ అనుకోలేదు. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే వెళ్లి హిట్టింగ్‌ ఆడటం ఒక్కటే మార్గం. అంతకు మించి ప్రణాళికలు ఏముంటాయి?

కారణం అదే
నిజానికి వాళ్లను 200- 210 పరుగులకే కట్టడి చేస్తామనుకున్నాం. అయితే, 2-3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం ప్రభావం చూపింది. ఇది చిన్న గ్రౌండ్‌. ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది. బెస్ట్‌ ఫినిషర్‌ క్రీజులో ఉన్నపుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నాడు.

చదవండి: #SRHvRCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్‌.. ఆర్సీబీకి వార్నింగ్‌! మామ మనోడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement