IPL 2024: ట్రిస్టన్‌ స్టబ్స్‌ అద్భుత విన్యాసం.. ఇదే ఢిల్లీని గెలిపించింది..! | IPL 2024 DC VS GT: Tristan Stubbs Superman Effort Seals Victory For Delhi Capitals | Sakshi
Sakshi News home page

IPL 2024: స్టబ్స్‌ అద్భుత ప్రయత్నం.. ఇదే గుజరాత్‌కు గెలుపును దూరం చేసింది

Published Thu, Apr 25 2024 12:52 PM | Last Updated on Thu, Apr 25 2024 12:52 PM

IPL 2024 DC VS GT: Tristan Stubbs Superman Effort Seals Victory For Delhi Capitals

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 24) జరిగిన రసవత్తర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి రిషబ్‌ పంత్‌ (43 బంతుల్లో 88 నాటౌట్‌; 5 ఫోర్లు, 8 సిక్సర్లు, 2 క్యాచ్‌లు), అక్షర్‌ పటేల్‌ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3 క్యాచ్‌లు, 3-0-28-1) ప్రత్యక్షంగా దోహదపడితే.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ పరోక్షంగా ఢిల్లీ గెలుపుకు కారణమయ్యాడు.

 

 

ఛేదనలో గుజరాత్‌ లక్ష్యం దిశగా పయనిస్తుండగా (11 బంతుల్లో 32 పరుగులు).. స్టబ్స్‌ అద్భుత విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లాల్సిన బంతిని (18.2వ ఓవర్‌: రసిక్‌ సలాం బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ కొట్టిన షాట్‌) ఆపాడు. ఫలితంగా ఢిల్లీకి ఐదు పరుగులు సేవ్‌ అయ్యాయి. ఇంచుమించు ఇదే తేడాతో (4 పరుగులు) ఢిల్లీ గుజరాత్‌పై విజయం​ సాధించింది. స్టబ్స్‌ తన అద్భుత ప్రయత్నంతో ఢిల్లీని గెలిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

స్టబ్స్‌ సూపర్‌ మ్యాన్‌ ఎఫర్ట్‌ను అంతా మెచ్చుకుంటున్నారు. భారీ స్కోర్లు చేసినా చేయకపోయినా ఇలాంటి ప్రయత్నాలే మ్యాచ్‌లు గెలిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఈ మ్యాచ్‌లో స్టబ్స్‌ బ్యాట్‌తోనూ రాణించాడు. ఇన్నింగ్స్‌ చివర్లో వచ్చి (7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు నాటౌట్‌) రిషబ్‌ పంత్‌తో కలిసి వీరబాదుడు బాదాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ (3-0-15-3) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ శర్మ (4-0-73-0) ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక  పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ సైతం అద్భుతంగా పోరాడింది. సాహా (39), సాయి సుదర్శన్‌ (65), మిల్లర్‌ (55), రషీద్‌ ఖాన్‌ (21 నాటౌట్‌), సాయికిషోర్‌ (13 నాటౌట్‌) గుజరాత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో స్టబ్స్‌ అద్భుత ప్రయత్నం గుజరాత్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. రషీద్‌ కొట్టిన ఆ షాట్‌ సిక్సర్‌ అయ్యుంటే గుజరాత్‌ ఈ మ్యాచ్‌ తప్పక గెలిచుండేది.

అంతిమంగా గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్‌ సలాం (4-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-29-2), అక్షర్‌ పటేల్‌ (3-0-28-1), నోర్జే (3-0-48-1), ముకేశ్‌ కుమార్‌ (4-0-41-1) వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ ఆరో స్థానానికి జంప్‌ కొట్టింది. గుజరాత్‌ ఏడో ప్లేస్‌లో నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement