
తడబడ్డా... నిలబడ్డారు
క్వార్టర్ ఫైనల్లో జర్మనీ
అల్జీరియాపై 2-1తో విజయం
ఓ వైపు మాజీ ప్రపంచ చాంపియన్ జర్మనీ... మరోవైపు చిన్న జట్టు అల్జీరియా... జర్మనీ ఆటగాళ్ల ఫామ్ ప్రకారం మామూలుగా అయితే నిర్ణీత సమయంలో మ్యాచ్ అయిపోవాలి. కానీ అల్జీరియా ఎదిరించింది. మ్యాచ్ ప్రారంభంలో 25 నిమిషాల పాటు జర్మనీని వణికించింది.
కాస్త ఆలస్యంగా కోలుకున్న జర్మనీ స్టార్ ఆటగాళ్లంతా కలిసి కట్టుగా దాడులు ప్రారంభించారు. కానీ అల్జీరియా గోల్ కీపర్ రైజ్‌ను మాత్రం అధిగమించలేకపోయారు. దీంతో నిర్ణీత సమయంలో గోల్స్ రాలేదు.
విరామంలో ఏం వ్యూహం మార్చారోగానీ... అదనపు సమయంలో చాంపియన్ స్థాయి ఆటతీరుతో జర్మనీ చెలరేగింది. 2-1తో అల్జీరియాను ఓడించి ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
పోర్ట్ అలెగ్రా: ఆరంభంలో తడబడినా... ఇంజ్యూరీ టైమ్‌లో కలిసికట్టుగా ఆడిన జర్మనీ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జర్మనీ 2-1తో అల్జీరియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో షుర్లే (92వ ని.), మీసట్ ఓజిల్ (120వ ని.) జర్మనీకి రెండు గోల్స్ అందిస్తే... అల్జీరియా తరఫున ఏకైక గోల్ జబోవ్ (120+1వ ని.) చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి నాకౌట్ మ్యాచ్ ఆడిన అల్జీరియా ఆకట్టుకుంది. అల్జీరియా కీపర్ రైజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆట 3వ నిమిషంలో ముస్తాఫీ (జర్మనీ) కొట్టిన బంతిని అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా నిర్ణయించారు. అల్జీరియా బ్యాక్‌లైన్ నుంచి ఈ బంతిని కొట్టినట్లు తేల్చారు. 9వ నిమిషంలో జర్మనీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ స్లిమాని (అల్జీరియా) ఊహించని రీతిలో బంతిని గోల్‌పోస్ట్ వైపు పంపాడు. అయితే జర్మనీ గోల్ కీపర్ మ్యాన్యుయేల్ న్యూయర్ సమర్థంగా నిలువరించాడు.
17వ నిమిషంలో జర్మనీ ఏరియాలో బంతిని డ్రిబ్లింగ్ చేసిన ఫెగోలి (అల్జీరియా) ఓ బలమైన షాట్‌తో నెట్‌వైపు పంపినా బంతి ఎక్కువ ఎత్తులో బయటకు వెళ్లింది. ఆ వెంటనే డైవ్ చేస్తూ స్లిమాని కొట్టిన హెడర్‌ను ఆఫ్‌సైడ్‌గా తేల్చారు. 25వ నిమిషంలో కార్నర్ నుంచి క్రూస్ ఇచ్చిన బంతి రీ బౌండ్ అయ్యింది. అక్కడే ఉన్న గోయెట్జీ గోల్ పోస్ట్‌లోకి పంపబోయినా అల్జీరియా కీపర్ రైజ్ నిలువరించాడు. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు పరస్పరం దాడులు చేసుకున్నా.. గోల్స్ మాత్రం రాలేదు.
రెండో అర్ధభాగంలో వచ్చిన షుర్లే ప్రభావం చూపాడు. 48వ నిమిషంలో అతను కొట్టిన కిక్ తృటిలో తప్పిపోయింది. 51వ నిమిషంలో ఫిలిప్ లామ్ (జర్మనీ) షాట్‌ను కీపర్ రైజ్ చేతి వేళ్లతో అడ్డుకోవడంతో అల్జీరియా ఊపిరి పీల్చుకుంది. నిర్ణీత సమయం మరో 10 నిమిషాలు ముగుస్తుందనగా థామస్ ముల్లర్ కొట్టిన హెడర్‌ను మరోసారి రైజ్ నిలువరించాడు. ఆ తర్వాత కూడా గోల్స్ రాకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారి తీసింది.
ఎక్స్‌ట్రా టైమ్ రెండో నిమిషంల్లోనే ముల్లర్ ఇచ్చిన పాస్‌ను షుర్లే (92వ ని.) తన కాళ్ల మధ్యలో అదుపు చేస్తూ చాలా దగ్గరి నుంచి గోల్ పోస్ట్‌లోకి పంపి జర్మనీ శిబిరంలో ఆనందం నింపాడు. ఎక్స్‌ట్రా టైమ్ చివర్లో జబోవ్ నుంచి బంతిని దొరకబుచ్చుకున్న ఓజిల్ నేర్పుగా నెట్‌లోకి పంపి స్కోరును డబుల్ చేశాడు. జబోవ్ (అల్జీరియా) తర్వాతి నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు.