కోడిపుంజును గద్ద..తన్నుకుపోయింది | Germany entered in semi finals | Sakshi
Sakshi News home page

కోడిపుంజును గద్ద..తన్నుకుపోయింది

Published Sat, Jul 5 2014 12:46 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

కోడిపుంజును గద్ద..తన్నుకుపోయింది - Sakshi

కోడిపుంజును గద్ద..తన్నుకుపోయింది

ప్రపంచకప్ సెమీస్‌లో జర్మనీ
 క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌పై 1-0తో విజయం
 
 ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు గుర్తు కోడిపుంజు...
 జర్మనీ ఫుట్‌బాల్ జట్టు గుర్తు గద్ద...
 ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోరాటం కూడా మినీ యుద్ధంలాగే సాగింది. ఆఖరి వరకూ రెండు జట్లూ హోరాహోరీ తలపడ్డాయి. కానీ అంతిమంగా కోడిపుంజును గద్ద తన్నుకుపోయింది.
 
 ఫ్రాన్స్‌పై గెలిచి జర్మనీ సెమీఫైనల్‌కు చేరింది. అంతేకాదు... ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు టోర్నీల్లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
 ఇక ఈ జట్టును విజేతగా నిలిపిన ఆటగాడి పేరు హమ్మెల్స్... అంటే జర్మనీ భాషలో తేనెటీగ అని అర్థం..!
 
 రియో డి జనీరో
 ఈసారి బ్రెజిల్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో నాకౌట్ దశలో అదనపు సమయం దాకా మ్యాచ్ వెళితే... చివర్లో ఆటగాళ్లకు శక్తి కావాలి. అందుకే మ్యాచ్ ప్రారంభంలో అన్ని జట్లు కాస్త నెమ్మదిగా ఆడుతున్నాయి. ప్రపంచకప్ తొలి క్వార్టర్ ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్ కూడా అలాగే ఆట మొదలుపెట్టాయి. ప్రత్యర్థుల కదలికల్లోని నెమ్మదిని గమనించిన జర్మనీ... నిమిషాల్లో వ్యూహం మార్చింది.
 
 ఒక్కసారిగా వేగం పెంచి గోల్ కొట్టింది. అంతే... ఫ్రాన్స్ తేరుకున్నా ఫలితం లేకపోయింది. మ్యాచ్ 13వ నిమిషంలో హమ్మెల్స్ గోల్‌తో ఆధిక్యంలోకి వచ్చిన జర్మనీ... ఆ తర్వాత ఫ్రాన్స్‌కు అవకాశం రాకుండా జాగ్రత్తపడింది. సమయం గడిచే కొద్దీ మరింత వేగం పెంచి ఫ్రాన్స్ దాడులు చేసినా క్వార్టర్స్‌తోనే వెనుదిరగాల్సి వచ్చింది.
 13వ నిమిషంలో గోల్ తొలి మూడు నిమిషాల్లో జర్మనీ బంతిని ఒకసారి లక్ష్యం వైపు పంపినా  ఫ్రాన్స్ ప్లేయర్ కబాయే సమర్థంగా తిప్పికొట్టాడు.
 
 7వ నిమిషంలో వల్బుయేనా ఇచ్చిన క్రాస్ పాస్‌ను బెంజెమా (ఫ్రాన్స్) గోల్‌పోస్ట్ వైపు పంపినా కాస్త దూరంగా బయటకు వెళ్లింది. తర్వాత స్ట్రయికర్ ముల్లర్, ఒజిల్ (జర్మనీ) సమయోచితంగా కదులుతూ ఫ్రాన్స్ బ్యాక్‌లైన్‌పై ఒత్తిడి పెంచారు.
 
  ఈ వ్యూహం 13వ నిమిషంలో ఫలించింది. మిడ్‌ఫీల్డర్ టోనీ క్రూస్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను సెంట్రల్ డిఫెండర్ హమ్మెల్స్ హెడర్‌తో అద్భుతమైన గోల్‌గా మలిచి జర్మనీకి 1-0 ఆధిక్యం అందించాడు. మధ్యలో రాపెల్ వరానే (ఫ్రాన్స్)ని అడ్డుపడ్డా హమ్మెల్స్ బంతిని సూపర్బ్‌గా పంపాడు.
 
 
 23వ నిమిషంలో మటౌడి, బెంజెమా (ఫ్రాన్స్) జర్మనీ రక్షణ శ్రేణిని ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదే క్రమంలో బెంజెమా కొట్టిన కిక్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా తేల్చారు.
 29వ నిమిషంలో ఎవ్రా (ఫ్రాన్స్) ఫౌల్ చేయగా, 31వ నిమిషంలో క్రూస్ (జర్మనీ) కొట్టిన కార్నర్‌ను సహచరులు అందుకోలేకపోయారు.
 
 తొలి అరగంటలో జర్మనీ సమయానుకూలంగా ఎదురుదాడులకు దిగితే, ఫ్రాన్స్ ప్రత్యర్థి సర్కిల్‌లోకి చొచ్చుకుపోవడంలో విఫలమైంది. ఒక్క బెంజెమా మాత్రమే నాలుగుసార్లు బంతిని జర్మనీ సర్కిల్‌లోకి తీసుకెళ్లినా గోల్ మాత్రం కొట్టలేకపోయాడు.
 
 బెంజెమా ఆకట్టుకున్నా....
 34వ నిమిషంలో వ్యాలీని వల్బుయేనా (ఫ్రాన్స్) బలంగా నెట్‌లోకి పంపేందుకు ప్రయత్నించినా జర్మనీ గోల్ కీపర్ న్యూయర్ అద్భుతంగా డైవ్ చేస్తూ తిప్పికొట్టాడు.
 
  42, 44వ నిమిషంలో సహచరులు ఇచ్చిన రెండు క్రాస్ పాస్‌లను బెంజెమా ప్రమాదరకర రీతిలో గోల్ పోస్ట్ వైపు పంపాడు. అయితే ఒకదాన్ని హమ్మెల్స్, మరోదాన్ని గోల్ కీపర్ న్యూయర్ నిలువరించారు.
 
 ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 55 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న జర్మనీ రెండుసార్లు గోల్స్ కోసం ప్రయత్నించి ఒక్కసారి సఫలమైంది. అయితే ఫ్రాన్స్ చేసిన ఐదు ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
 
 ఆఖరి క్షణాల్లో ఆదుకున్న న్యూయర్
 47వ నిమిషంలో వల్బుయేనా (ఫ్రాన్స్) కొట్టిన కిక్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా నిర్దారించారు. ఆ తర్వాత రెండు నిమిషాలకే బెంజెమా, మటౌడి సమయోచితంగా కదులుతూ హమ్మెల్స్‌ను ఛేదించే ప్రయత్నం చేశారు. కానీ హమ్మెల్స్ కౌంటర్ అటాక్‌కు దిగడంతో వెనక్కు తగ్గారు.
 స్కెవిన్‌స్టిగర్, ముల్లర్, ఒజిల్, క్రూస్, లామ్ ఒకరికొకరు బంతిని అందించుకుంటూ 54వ నిమిషంలో ముందుకెళ్లినా...చివర్లో లామ్ కొట్టిన బంతి బయటకు దూసుకుపోవడంతో ఫ్రాన్స్ ఊపిరి పీల్చుకుంది.
  60వ నిమిషంలో వల్బుయేనా (ఫ్రాన్స్) కొట్టిన కార్నర్ షాట్‌ను వరానే నెట్‌లోకి పంపినా జర్మనీ గోల్ కీపర్ న్యూయర్ చక్కగా అందుకున్నాడు. తర్వాతి ఐదు నిమిషాలు పరస్పరం బంతి కోసం పోరాడినా... గోల్స్ అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోయారు.
 
 69వ నిమిషంలో ముల్లర్, షుర్లే (జర్మనీ) కొట్టిన రెండు షాట్స్‌ను ఫ్రాన్స్ నిలువరించింది. 78వ నిమిషంలో బెంజెమా గోల్ పోస్ట్ ముందరకు దూసుకొచ్చి బంతిని నేరుగా బలంగా సంధించినా కీపర్ న్యూయర్ అడ్డుకున్నాడు.  
 
  82వ నిమిషంలో పిచ్ మధ్య నుంచి షుర్లే (జర్మనీ) నేరుగా కొట్టిన బంతిని ఫ్రాన్స్ కీపర్ లోరిస్ అదుపు చేశాడు. 88వ నిమిషంలో ముల్లర్, ఎవ్రా, షుర్రే చేసిన అటాకింగ్‌ను వరానే ఫ్రాన్స్) నిలువరించాడు.
 
 ఎక్స్‌ట్రా టైమ్‌లో బెంజెమా గోల్ చేసినంత పని చేసినా జర్మనీ కీపర్ న్యూయర్ ఒంటిచేత్తో బంతిని బయటకు పంపడంతో జర్మనీ ఏకైక గోల్‌తో విజయం అందుకుంది.
 
 16 జర్మనీ తమ చివరి పదహారు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement