ఈ పతకాలు మాకొద్దు!
తిరిగిచ్చేసిన గోవా అథ్లెట్లు
మార్గోవా: క్రీడా ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆయా ఆటగాళ్లకు పతకాలు అందజేయడం పరిపాటి. అయితే తమ ఆటతీరుకు పురస్కారంగా లభించిన ఈ పతకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని వాటిని తిరిగి ఇచ్చేసిన ఘటన ఇది. జనవరిలో గోవాలో లూసోఫోనియా గేమ్స్ జరిగాయి.
ఈ టోర్నీలో అదే రాష్ట్రానికి చెందిన అనిక్ (రజతం), పెరీరా (కాంస్యం), హిమాన్షు (కాంస్యం) పతకాలు నెగ్గారు. అయితే పతకాలు అందుకొని నెల కూడా గడవకముందే వాటిపై మెరుపు మాయమైంది. రజత పతకం క్రమేణా మసకబారింది. కాంస్య పతకాలపై మొత్తం నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఇంత నాసిరకం పతకాలు అంటగడతారా అంటూ అథ్లెట్లు వాటిని నిర్వాహకులకు తిరిగిచ్చేశారు. అనధికారిక ఫిర్యాదు మేరకు లూసోఫోనియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ వాటిని తనిఖీ చేసిందని, పతకాల స్వరూపం చూసి వారు షాక్ తిన్నారని గోవా డెరైక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ వీఎం ప్రభుదేశాయ్ అన్నారు.