మహిళా గోల్ కీపర్పై నిషేధం!
యూఎస్: రియో ఒలింపిక్స్ సందర్భంగా స్వీడన్ సాకర్ జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా జాతీయ మహిళా ఫుట్ బాల్ జట్టు గోల్ కీపర్ హోప్ సోలోపైనిషేధం పడింది. ఈ మేరకు సోలోపై ఆరు నెలల నిషేధం విధిస్తున్నట్లు అమెరికా సాకర్ అధ్యక్షుడు సునీల్ గులాటి స్పష్టం చేశారు. క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఓటమి పాలైన అనంతరం స్వీడన్ 'పిరికిపందల జట్టు' అంటు సోలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అమెరికా సాకర్ యాజమాన్యం... ఒక జట్టుపై అలా వ్యాఖ్యానించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిలో భాగంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పెనాల్టీ షూటౌట్ లో స్వీడన్ 4-3 తేడాతో అమెరికాను ఓడించి సెమీ ఫైనల్ దూసుకెళ్లింది. దీంతో ఒలింపిక్స్లో వరుసగా నాల్గోసారి సెమీ ఫైనల్ చేరాలనుకున్న అమెరికా ఆశలకు కళ్లెం పడింది.