
న్యూఢిల్లీ: గత నెల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోమతి మరిముత్తు విజేత. సరిగ్గా నెలతిరిగేలోపే డోపీ. అప్పుడేమో స్వర్ణం తెచ్చింది. ఇప్పుడేమో భారత క్రీడారంగానికి మచ్చతెచ్చింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో మంగళవారం గోమతిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేశారు. తమిళనాడుకు చెందిన ఈ మహిళా రన్నర్ గత నెల 22న నిర్వహించిన 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలిచింది. దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సందర్భంగా 30 ఏళ్ల గోమతికి నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. ఆమె ‘ఎ’ శాంపిల్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా పట్టుబడింది. ఇప్పుడు మళ్లీ ‘బి’ శాంపిల్‌లోనూ పట్టుబడితే గరిష్టంగా ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి.
నిజానికి ఆమె ఫెడరేషన్ కప్‌లోనే దొరికిపోయింది. మార్చిలో పాటియాలాలో జరిగిన ఈవెంట్ సందర్భంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమె రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రిపోర్టులో వచ్చింది. అయితే ‘నాడా’ ఈ విషయాన్ని సంబంధిత క్రీడా సంఘానికి తెలపడంలో విఫలమైంది. అçప్పుడే రిపోర్టు ఇచ్చివుంటే ఆసియా ఈవెంట్‌కు ఎంపిక చేయకుండా ఉండేవారమని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) తెలిపింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌ను సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.