గ్రేమ్ స్వాన్
మెల్‌బోర్న్: ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టు ప్రధాన స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ఆదివారం గుడ్‌బై చెప్పాడు. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. ‘అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నా. చాలా సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా.
ఏడేళ్లుగా ఇంగ్లండ్ జట్టు నా కుటుంబంలా వ్యవహరించింది. నా నిర్ణయం కఠినమే అయినా వైదొలగడానికి ఇదే సరైన సమయం’ అని స్వాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 2008లో భారత్‌పై అరంగేట్రం చేసిన 34 ఏళ్ల స్వాన్ ఇంగ్లండ్ తరఫున 60 టెస్టులు ఆడి 1370 పరుగులు, 255 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 104 వికెట్లు తీసి 500 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.