బెల్జియం బోల్తా...
* ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ఇటలీ సంచలన విజయం
* యూరో కప్‌లో శుభారంభం
లియాన్ (ఫ్రాన్స్): గత రెండు ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్ర్కమించి... గత ప్రాభవం కోసం పరితపిస్తున్న ఇటలీ జట్టు యూరో కప్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 2-0 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇటలీ తరఫున 32వ నిమిషంలో గియాచెరిని తొలి గోల్ చేయగా... ఇంజ్యురీ టైమ్‌లో (90+3వ నిమిషంలో) గ్రాజియానో పెలె రెండో గోల్‌ను అందించాడు.
ప్రస్తుత ఇటలీ జట్టు గతంలో ఎన్నడూలేని విధంగా బలహీనంగా ఉందని, ఆ జట్టు నుంచి యూరోలో అద్భుతాలు ఆశించకూడదని పలువురు విశ్లేషకులు వేసిన అంచనా తొలి మ్యాచ్ ప్రదర్శనతో పటాపంచలైంది. గత మూడు యూరో టోర్నీలకు అర్హత పొందడంలో విఫలమైన బెల్జియం ఈసారి మాత్రం క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచి ఏడాది క్రితమే బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరైన బెల్జియం తొలి మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది. ఇటలీ గోల్‌పోస్ట్‌పై ఏకంగా 18 సార్లు దాడులు చేసినప్పటికీ ఫినిషింగ్ లోపం ఆ జట్టును వేధించింది. మరోవైపు ఇటలీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని బోణీ కొట్టింది. తాజా ఫలితంతో గత 34 ఏళ్లలో బెల్జియంపై అధికారిక మ్యాచ్‌లో ఓటమి ఎరుగని రికార్డును ఇటలీ నిలబెట్టుకుంది.
మ్యాచ్‌లో పూర్తి సమన్వయంతో ఆడిన ఇటలీ 32వ నిమిషంలో ఖాతా తెరిచింది. బెల్జియం డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ లియోనార్డో బోనూచి అందించిన పాస్‌ను అందుకున్న గియాచెరిని మిగతా పనిని పూర్తి చేశాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు బెల్జియం ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. 53వ నిమిషంలో లుకాకు ఎడమవైపు నుంచి దూసుకెళ్లి కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కూడా బెల్జియం ఆటగాళ్లు దాడులు చేసినా పటిష్టమైన డిఫెన్స్‌తో ఇటలీ వారి అవకాశాలను అడ్డుకుంది.
హంగేరి అదుర్స్
నాలుగు దశాబ్దాల తర్వాత యూరో చాంపియన్‌షిప్‌కు అర్హత పొందిన హంగేరి జట్టు అద్భుత విజయంతో బోణీ కొట్టింది. ఆస్ట్రియాతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో హంగేరి 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. హంగేరి తరఫున 62వ నిమిషంలో ఆడమ్ సజాలాయ్, 87వ నిమిషంలో జోల్టాన్ స్టీబెర్ ఒక్కో గోల్ చేశారు. 40 ఏళ్ల హంగేరి గోల్‌కీపర్ గాబోర్ కిరాలీ ఈ మ్యాచ్‌లో పాల్గొని యూరో టోర్నీ చరిత్రలో మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
‘యూరో’లో నేడు
రష్యా X స్లొవేకియా సా.గం. 6.30 నుంచి
రుమేనియా X స్విట్జర్లాండ్ రా.గం. 9.30 నుంచి
ఫ్రాన్స్ X అల్బేనియా రా.గం. 12.30 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం