‘ఇట్స్ కమింగ్ హోమ్... యూరో కప్ ప్రారంభమైన రోజు నుంచి ఇంగ్లండ్ అభిమానులు ఎప్పటిలాగే ఆశలు, అంచనాలతో హోరెత్తించారు. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఫైనల్ చేరడంతో వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. సొంతగడ్డపై జరిగే తుది పోరులో కచ్చితంగా తమ జట్టే గెలుస్తుందని భావించి ముందస్తు సంబరాలకు సిద్ధమైపోయారు. కానీ యూరో కప్ ఇంగ్లండ్ ఇంటికి రాలేదు. లండన్ నుంచి సుమారు వేయి మైళ్ల దూరంలోని రోమ్ నగరానికి తరలి పోయింది. పెనాల్టీ షూటౌట్ వరకు చేరిన సమరంలో సత్తా చాటిన ఇటలీ యూరప్ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు యూరో గెలవడం ఇది రెండోసారి కాగా... ఇంగ్లండ్ తొలి టైటిల్ విజయానికి మరోసారి దూరంగా నిలిచిపోయింది.
లండన్: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ యూరో కప్ –2020ని ఇటలీ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్‌లో 3–2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కూడా ముగిసిన తర్వాత ఇరు జట్లు 1–1 గోల్స్ స్కోరుతో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
అంతకుముందు తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ తరఫున 2వ నిమిషంలో ల్యూక్ పాల్ షా గోల్ సాధించగా... రెండో అర్ధభాగంలో లియోనార్డో బొనుసి 67వ నిమిషంలో ఇటలీకి గోల్ అందించి స్కోరు సమం చేశాడు. తాజా విజయంతో వరుసగా 34 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని ఘనతను సాధించిన ఇటలీ 1968 తర్వాత మళ్లీ యూరో ట్రోఫీని గెలుచుకుంది. మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్‌లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
హోరాహోరీ...
90 వేల సామర్థ్యం గల వెంబ్లీ స్టేడియం... కరోనా కారణంగా అధికారికంగా 67 వేల మందికే అనుమతి. అయితేనేం... తమ జట్టు ఆడుతోంది కాబట్టి టికెట్ లేని వీరాభిమానులు కూడా గేట్లు బద్దలు కొట్టి పెద్ద సంఖ్యలో స్టేడియంలోకి దూసుకొచ్చారు. ఫైనల్లో తొలి 30 నిమిషాల ఆట చూస్తే స్థానిక అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసేలా కనిపించింది. ఆట ఆరంభంలోనే ట్రిప్పియర్ ఇచ్చిన హాఫ్ వాలీ క్రాస్ పాస్‌ను నేరుగా ఇటలీ గోల్ పోస్ట్‌లోకి షా పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. 1 నిమిషం 57వ సెకన్లో షా చేసిన ఈ గోల్ ఒక యూరో ఫైనల్లో అత్యంత వేగవంతమైన గోల్‌గా గుర్తింపు పొందింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇటలీ మెల్లగా కోలుకునే ప్రయత్నం చేసింది. జట్టు మిడ్ ఫీల్డర్లు చక్కటి పాస్‌లతో బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా డిఫెన్స్‌కే పరిమితమైంది.
ముఖ్యంగా కెప్టెన్ హ్యరీ కేన్ కనీసం ఒక్క గోల్ స్కోరింగ్ అవకాశం కూడా సృష్టించకుండా పేలవ ప్రదర్శన కనబర్చడం జట్టును దెబ్బ తీసింది. రెండో అర్ధ భాగంలో ఇటలీ శ్రమకు తగిన ఫలితం లభించింది. వెరాటీ కొట్టిన హెడర్‌ను ఇంగ్లండ్ కీపర్ పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నా... సమీపంలోనే ఉన్న బొనుసి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫల మయ్యాడు. అదనపు సమయంలో మాత్రం ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలమమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందకు షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో ఇటలీ 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సాకా గోల్ చేసి ఉంటే మ్యాచ్ సడెన్‌డెత్‌కు వెళ్లేది. అయితే తొలిసారి జాతీయ జట్టు తరఫున పెనాల్టీ తీసుకున్న సాకా కొట్టిన కిక్‌ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డొనరుమా ఎలాంటి ఆందోళన లేకుండా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ కూల్‌గా ఆపడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.
ఇంగ్లండ్ ప్లేయర్ సాకా కొట్టిన చివరి షాట్‌ను నిలువరిస్తున్న ఇటలీ గోల్‌కీపర్ డొనరుమా
పునరుజ్జీవం...
నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్... 2018లో జరిగిన ప్రపంచకప్‌కు కనీసం అర్హత సాధించలేకపోయింది. ఇటలీ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విచారకర క్షణాలవి. ప్రదర్శన పాతాళానికి పడిపోయిన జట్టును తీర్చిదిద్దే బాధ్యతను కొత్త కోచ్ రాబర్టో మన్సినీ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇటలీ ‘పునరుజ్జీవం’ పొందింది. ‘యూరో’ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడిన పది మ్యాచ్‌లలో పది కూడా గెలిచి అజేయంగా, అందరికంటే ముందుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది.
గత ఏడాదే జరగాల్సిన ఈ మెగా టోర్నీ కోవిడ్ కారణంగా ఏడాది వాయిదా పడింది. ఆ సమయంలో ఇటలీ దేశం తీవ్ర క్షోభను అనుభవించింది. కరోనా కారణంగా ఆ దేశంలో ఏకంగా 1 లక్షా 27 వేల మరణాలు నమోదయ్యాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌లో ఇదే పెద్ద సంఖ్య. గత 16 నెలల్లో వివిధ రూపాల్లో లాక్‌డౌన్‌లను ఎదుర్కొన్న ఇటలీకి ‘యూరో’ కొత్త ఆరంభాన్నిచ్చింది. ఈ టోర్నీలో సొంతగడ్డ రోమ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఫైనల్‌తో కలిపి ఇటలీకి వరుసగా 34 మ్యాచ్‌లలో ఓటమి అనేదే లేదు. అసాధారణ పరిస్థితులను అధిగమించి, తమకు ఊరటనందిస్తూ సాధించిన ఈ విజయానికి యావత్ ఇటలీ పులకించిపోయిందంటే అతిశయోక్తి కాదు.
ఆ ముగ్గురిపై ఆగ్రహం...
19, 21, 23... ఇంగ్లండ్ తరఫున మూడు పెనాల్టీలు వృథా చేసిన బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్‌ల వయసులు ఇవి. చెప్పుకోదగ్గ అంతర్జాతీయ అనుభవం లేని కుర్రాళ్లు.
అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యరీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం విషాదం!
అవార్డులు
గోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్)
క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–5 గోల్స్)
గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్ ప్లేయర్)
డొనరుమా (ఇటలీ)
Comments
Please login to add a commentAdd a comment