అటువైపు మాజీ చాంపియన్ స్పెయిన్... ఇటువైపు రొనాల్డో సైన్యం పోర్చుగల్... ఈ రెండు గట్టి జట్ల కారణంగా ఫిఫా ప్రపంచకప్–2018 గ్రూప్ ‘బి’ ఆసక్తికరంగా మారింది. మిగతా గ్రూప్‌లలో ప్రమాదకర ప్రత్యర్థులు తర్వాతి దశలో ఎదురయ్యే అవకాశం ఉంది. ‘బి’లో మాత్రం స్పెయిన్, పోర్చుగల్ మధ్య లీగ్ దశలోనే హోరాహోరీ సమరం తప్పదు. దీంతో మొత్తం ఎనిమిది గ్రూప్‌ల్లో ఇందులోనే పోటీ ఒకింత ఎక్కువగా కనిపిస్తున్నది. ఇరాన్, మొరాకోలు సంచలనాలు సృష్టిస్తేనే తప్ప... 1, 2 స్థానాలు యూరప్ జట్లవేనని చెప్పొచ్చు.
రొనాల్డోపైనే భారం!
జట్టంతా ఒక ఎత్తు. రొనాల్డో ఒక్కడే ఒక ఎత్తు. దీన్నిబట్టే ప్రపంచ కప్‌లో పోర్చుగల్ ప్రయాణం అతడిపై ఎంతగా ఆధారపడి ఉందో చెప్పొచ్చు. కెరీర్ చరమాంకానికి చేరుకున్న ఈ సూపర్ స్టార్ చిరకాల కోరిక నెరవేరేందుకు ఇదే చివరి అవకాశం. భిన్న దేశాల ఆటగాళ్లుండే లీగ్‌లలో అద్భుతంగా రాణించే రొనాల్డోకు... జాతీయ జట్టులో మాత్రం ఇంతకాలం సరిజోడైన ఆటగాళ్లు లేరు. దీంతో పోర్చుగల్ అతడే ఒక సైన్యంగా బరిలో దిగాల్సి వచ్చేది. అయితే, దృఢమైన డిఫెండర్ పెపె, బంతిని చక్కగా అందించే జావో మౌంటిన్హో, కొత్త కెరటం ఆండ్రె సిల్వలతో ఈసారి కొంత మార్పు కనిపిస్తోంది. రొనాల్డోకు దాడులకు వీరి ఆట తోడైతే తిరుగుండదు. అనుభవజ్ఞులుండటంతో కొంత ఆశలు రేపుతోంది. రొనాల్డో లేకుండా కూడా తాము టైటిల్స్ గెలవగలమని 2016 యూరోపియన్ చాంపియన్ షిప్‌లో పోర్చుగల్ నిరూపించింది. నాడు స్టార్ ఫార్వర్డ్ గాయంతో దూరమైనప్పటికీ ఈ జట్టు... ఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించడం గమనార్హం.
కీలకం: రొనాల్డో, పెపె. 33 ఏళ్ల వయసులో రొనాల్డో తన అనుభవాన్నంతా రంగరించి ఆడాల్సిన అవసరముంది. కప్ అందిస్తే మాత్రం ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిపోతాడు.
కోచ్: శాంటోస్. 2014లో బాధ్యతలు స్వీకరించాడు. జట్టుకు దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను సృష్టించాడు. ఇది రొనాల్డో పనిని సులువు చేయనుంది.
ప్రపంచ ర్యాంక్: 4
చరిత్ర: ఏడు సార్లు క్వాలిఫై అయింది. 1966లో మూడో స్థానంలో, 2006లో నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.
ఇరాన్ రాణించేనా?
ఆసియా నుంచి ఈసారి తొలి బెర్త్ దక్కించుకున్న జట్టు ఇరాన్. వరుసగా రెండోసారి క్వాలిఫై అయింది. మొదటి అర్హత రౌండ్‌లో 18 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. రెండో రౌండ్‌లో ఓ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 2014లో ఒక్క విజయం కూడా లేకుండానే కప్ నుంచి నిష్క్రమించింది.
కీలకం: సర్దార్ అజ్మన్. 22 ఏళ్ల ఈ ఫార్వర్డ్ 2015 ఆసియా కప్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చాడు.
కోచ్: కార్లోస్ క్విరెజ్. పోర్చుగల్ దేశస్తుడు. 2014కు ముందునుంచి కొనసాగుతున్నాడు. తాము రష్యా వెళ్తున్నది విహార యాత్రకు కాదంటూ ప్రకటించాడు.
ప్రపంచ ర్యాంక్: 36
చరిత్ర: ఐదోసారి బరిలో నిలిచింది. ఎన్నడూ గ్రూప్ దశ దాటలేదు. 1978లో 14వ స్థానంలో నిలవడమే మెరుగైన రికార్డు.
ముందడుగేస్తే గొప్పే...
ఆఫ్రికా ఉత్తర ప్రాంత దేశమైన మొరాకో 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. హకీమ్ జియెచ్, యూనెస్ బెల్హాండా వంటి ప్రతిభావంతులైన యువకులతో ఆసక్తి రేపుతోంది. అయినా దిగ్గజ జట్లను దాటుకుని ముందుకెళ్లాలంటే శక్తికి మించిన ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. కోచ్ హెర్వ్ రెనార్డ్. జియెచ్ మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినా, ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకోవాలి.
కీలకం: నబిల్ దిరార్. గత సీజన్‌లో ఫ్రెంచ్ లీగ్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
కోచ్: హెర్వ్ రెనార్డ్. ఫ్రాన్స్ దేశస్తుడు. జట్టులో క్రమశిక్షణ, విజయ కాంక్ష పెంచాడు. మెరుపు దాడులతో పాటు, చక్కటి డిఫెండింగ్ వ్యవస్థను రూపొందించాడు. గతంలో జాంబియా, ఐవరీకోస్ట్ జట్లను తీర్చిదిద్దాడు.
ప్రపంచ ర్యాంక్: 42
చరిత్ర: ఇప్పటివరకు ఆరుసార్లు క్వాలిఫై అయింది. 1986లో 11వ స్థానంలో నిలవడమే గొప్ప ప్రదర్శన.
టికి టకా ఎందాకనో!
టికి టకా...ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్పెయినే. తక్కువ దూరం పాస్‌లతో ఆకట్టుకునే ఈ తరహా ఆటతో 2010లో జట్టు తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపర్చింది. కానీ, తర్వాత నుంచి అనూహ్యంగా వెనుకబడింది. 2014లో డిఫెండింగ్ చాంపియన్‌గా దిగి... 23వ స్థానంతో దారుణ పరాభవం పాలైంది. 2016లో యూరో కప్‌నూ నిలబెట్టుకోలేకపోయింది. అయితే, సెర్గియో రామోస్, గెరార్డ్ పికె వంటి డిఫెండర్లు, స్ట్రయికర్ అల్వారో మొరాటా, డిగో కోస్టా, గోల్ కీపర్ డేవిడ్ డె గీతో పాటు నాణ్యమైన మిడ్ ఫీల్డర్లు, ఫార్వర్డ్‌లున్నందున ఈసారి ముందడుగు వేసే అవకాశాలు బాగానే ఉన్నాయి.
కీలకం: 34 ఏళ్ల ఆండ్రెస్ ఇనెస్టా. 2010 ప్రపంచకప్‌లో గోల్‌తో కప్ సాధించి పెట్టాడు. ఈసారి ఏమేరకు రాణిస్తాడో చూడాలి.
కోచ్: జులెన్ లొప్టెగ్యు. మాజీ గోల్ కీపర్ అయిన ఇతడు జట్టులో పునరుత్తేజం నింపాడు. తన ఆధ్వర్యంలోనే స్పెయిన్... 10 క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి, ఒకటి డ్రా చేసుకుని అజేయంగా నిలిచింది. ఇటలీని ఏకంగా 3–0తో ఓడించింది.
ప్రపంచ ర్యాంక్: 8
చరిత్ర: 14 సార్లు క్వాలిఫై అయింది. 2010 చాంపియన్. 1950లో 4వ, 2002లో 5వ స్థానంలో నిలిచింది. 2014లో 23వ స్థానంలో నిలవడం జట్టు చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యం.
Comments
Please login to add a commentAdd a comment