ముంబై: బరిలోకి దిగిన తొలి ఏడాదే గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ 42–17తో బెంగాల్ వారియర్స్‌పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆటగాళ్లంతా జట్టు విజయంలో సమష్టిగా చెమటోడ్చారు. రైడింగ్‌లో సచిన్ (9 పాయింట్లు), మహేంద్ర రాజ్‌పుత్ (8) తమ జోరు చూపెట్టారు. మిగతా వారిలో రాకేశ్ నర్వాల్, సునీల్ కుమార్ చెరో నాలుగు పాయింట్లు సాధించగా, ఫజల్ అత్రాచలి 2 పాయిం ట్లు చేశాడు. డిఫెన్స్‌లో అబొజర్ మిఘాని, పర్వేశ్ బైన్స్‌వాల్ చెరో 4 టాకిల్ పాయింట్లు సాధించారు. మరోవైపు బెంగాల్ వారియర్స్ ఆటతీరును చూస్తే ఓడినా పోయేదేం లేదన్నట్లు ఆడింది. ప్రత్యర్థి జట్టు సమష్టిగా రాణిస్తుంటే... బెంగాల్ ఆటగాళ్లు మాత్రం మూకుమ్మడిగా చేతులెత్తేశారు. రైడర్లు మణిందర్ సింగ్, జంగ్ కున్ లీ పేలవంగా ఆడారు. జట్టులో కీలకమైన ఆటగాళ్లు కేవలం ఒక్కో పాయింట్‌కే పరిమితమవడం జట్టును ఘోరంగా దెబ్బతీసింది.
ప్రదీప్ మళ్లీ ‘సూపర్’
మూడో ఎలిమినేటర్‌లో సూపర్ రైడింగ్‌తో ప్రదీప్ నర్వాల్ (19 పాయింట్లు) పట్నా పైరేట్స్‌ను గెలిపించాడు. మ్యాచ్ ముగిసేందుకు మరో ఐదు నిమిషాలే మిగిలుండగా... పట్నా 24–29 స్కోరుతో పుణేరి పల్టన్ జోరుకు వెనుకబడింది. ఇక ఓటమి తప్పదనుకున్న తరుణంలో రైడింగ్‌కు వెళ్లిన ప్రదీప్ 4 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఇది మ్యాచ్‌నే మలుపుతిప్పింది. ఈ రైడింగ్‌కు ముందు ఐదు పాయింట్లు వెనుకంజలో ఉన్న పట్నా అనూహ్యంగా 28–29 స్కోరుతో అంతరాన్ని తగ్గించేసింది. అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలో (రెండు రైడింగ్‌లలో) జట్టు 31–30తో ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ ముగుస్తున్న దశలో చెలరేగి ఆడిన పట్నా 42–32తో పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది.
►తొలి క్వాలిఫయర్‌లో ఓడిన బెంగాల్ వారియర్స్‌కు రెండో క్వాలిఫయర్ రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశముంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌లో పట్నా పైరే ట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment