స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన పాపులర్ వాట్సాప్ మెసేజ్‌పై ట్విట్టరియన్లు తెగ జోకులు పేల్చుతున్నారు. రెస్టారెంట్‌లో డిన్నర్ చేసిన అనంతరం బిల్లు పేమెంట్ చేసేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి మనతో డిన్నర్ చేసిన ఫీల్ వస్తుందని భజ్జీ ట్వీట్ చేశారు. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ఈ పాపులర్ వాట్సాప్ జోకును తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం రెస్టారెంట్ల బిల్లులో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీలు వేరువేరుగా వస్తున్నాయి. దీనిపై కామెడీ చేస్తూ భజ్జీ ఈ ట్వీట్ చేశారు. భజ్జీ చేసిన ఈ ట్వీట్‌పై విపరీతైన స్పందనలు వస్తూ ఉన్నాయి.
భజ్జీ ఫీలింగ్ సరియైనదని, తనకు కూడా అలానే అనిపిస్తుందని, ఎందుకు రెండు జీఎస్టీలు ఉన్నాయో తనకు అర్థం కావడం లేదని, మనకు అరుణ్ జైట్లీ జీ కూడా వివరించలేరని ఓ ట్విట్టరియన్ పేర్కొన్నాడు. అంతకముందు కూడా వీరిద్దరూ మనతో డిన్నర్ చేసేవాళ్లని, కానీ ప్రస్తుతం రెండు వేరువేరు ఆహ్వాన పత్రికలపై మన దగ్గరకి వస్తున్నారంటూ మరో ట్విట్టరియన్ అన్నాడు. ఇలా హర్భజన్ ట్వీట్‌పై ట్విట్టరియన్లు ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి భజ్జీ ట్వీట్లతో వార్తలోకి ఎక్కుతునే ఉన్నారు. ఏదో ఒక ట్వీట్‌తో ట్విట్టరియన్లను అలరిస్తున్నారు.