కోల్‌కతా: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పురుషుల ర్యాపిడ్ విభాగంలో తొలి మూడు రౌండ్‌లు ముగిశాక... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండు పాయింట్లతో అరోనియన్, మమెదైరోవ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం మొదలైన ఈ మెగా టోర్నమెంట్‌లో 10 మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం పోటీపడుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్, లెవాన్ అరోనియన్ (అర్మేనియా), షకిర్యార్ మమెదైరోవ్ (అజర్‌బైజాన్), సో వెస్లీ (అమెరికా), హికారు నకముర (అమెరికా), సెర్గీ కర్జాకిన్ (రష్యా)లాంటి మేటి గ్రాండ్‌మాస్టర్స్‌తోపాటు భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీ, విదిత్, నిహాల్ సరీన్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
సూర్యశేఖర గంగూలీతో జరిగిన ర్యాపిడ్ తొలి గేమ్‌ను 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... రెండో గేమ్‌లో 42 ఎత్తుల్లో మమెదైరోవ్‌ను ఓడించాడు. నకమురతో జరిగిన మూడో గేమ్‌ను హరికృష్ణ 38 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. విశ్వనాథన్ ఆనంద్ తాను ఆడిన మూడు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. తొలి గేమ్‌ను సో వెస్లీతో 145 ఎత్తుల్లో... రెండో గేమ్‌ను కర్జాకిన్‌తో 31 ఎత్తుల్లో... మూడో గేమ్‌ను అరోనియన్‌తో 38 ఎత్తుల్లో ఆనంద్ ‘డ్రా’ చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment