సీఎం చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరిస్తున్న హర్మన్‌ప్రీత్ (ఫైల్ ఫొటో)
చంఢీఘడ్ : భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీ హోదాను తొలిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పోలీస్ శాఖ అవి నకిలీవేనని తేల్చింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ డీఎస్పీ ర్యాంకు హోదాను తొలిగించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో భారత్‌కు ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ పోలీసు శాఖకి సర్టిఫికేట్స్ సమర్పించారు. కానీ.. విచారణలో అవి నకిలీవని తేలింది. దీంతో.. ఇక నుంచి హర్మన్‌ప్రీత్‌ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం చూస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలో ఒప్పుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. ఒకవేళ హర్మన్‌ప్రీత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డుని కూడా కోల్పోవాల్సి ఉంటుంది.
ఈ ఘటనపై హర్మన్‌ప్రీత్ కౌర్ మేనేజర్ స్పందిస్తూ.. ఈ విషయంలో ఇప్పటి వరకు పంజాబ్ పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ఇదే సర్టిఫికేట్‌తో ఆమె రైల్వేలో ఉద్యోగం చేసిందని, అది ఇప్పుడేలా నకిలీది అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఆమె పంజాబ్ పోలీస్ శాఖలో చేరేంత వరకు రైల్వే ఉద్యోగం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment