
విరాట్ మరో రికార్డు బద్దలైంది!
సెయింట్ కిట్స్: వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా సాంప్రదాయ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు దూకుడుతో చెలరేగిపోతారు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అయితే మరొకరు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ వన్డేల్లో నెలకొల్పిన వేగవంతమైన 23 సెంచరీల రికార్డును సఫారీ ఆటగాడు ఆమ్లా అధిగమించడమే వారి మధ్య పోటీకి అద్దం పడుతోంది.
ముక్కోణపు సిరీస్ లోభాగంగా వెస్టిండీస్తో బుధవారం జరిగిన వన్డేలో ఆమ్లా శతకంతో అలరించాడు. దీంతో కోహ్లి 23 వేగవంతమైన సెంచరీల రికార్డు బద్దలైంది. విరాట్ 157 ఇన్నింగ్స్లలో 23వ సెంచరీని చేస్తే, ఆమ్లాకు 132వ ఇన్నింగ్స్లోనే ఆ మార్కును చేరాడు. సమకాలీన క్రికెట్లో ఈ ఇద్దరు క్రికెటర్లు 2008లోనే అంతర్జాతీయ వన్డే కెరీర్ను ఆరంభించడం మరో విశేషం. ఒకవైపు రికార్డులు సృష్టించుకుంటూ విరాట్ ముందుకు సాగుతుంటే, ఆమ్లా వాటిని అధిగమిస్తునే ఉన్నాడు.
గతంలో వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి సాధించిన ఘనతలను ఆమ్లా బ్రేక్ చేశాడు. మరోవైపు విరాట్ పిన్నవయసులో నమోదు చేసిన 10 సెంచరీల వన్డే రికార్డును దక్షిణాఫ్రికాకే చెందిన డీకాక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధిగమించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా డీ కాక్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే, అదే విరాట్ 10 సెంచరీలు చేయడానికి 23 సంవత్సరాల 159 రోజులు పట్టింది. ఇదిలా ఉండగా కోహ్లి ఇప్పటివరకూ 171 వన్డే ఇన్నింగ్స్ల్లో 25వ సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.