సుశీల్కు అవకాశం దక్కలేదు..
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్లో భాగంగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్తో ట్రయల్ నిర్వహించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మరో రెజ్లర్ సుశీల్ కుమార్ కు నిరాశే ఎదురైంది. నర్సింగ్ యాదవ్తో ట్రయల్ నిర్వహించాలన్న సుశీల్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఒలింపిక్స్ కు సమయం దగ్గరకొస్తున్న సమయంలో ఇద్దరు రెజ్లర్లకు ట్రయల్స్ నిర్వహించడం సమంజసం కాదన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) వాదనను హైకోర్టు సమర్థించింది. ఒకవేళ ట్రయల్స్ నిర్వహించిన క్రమంలో అథ్లెట్ కు గాయమైతే అది ఒలింపిక్స్ కు వెళ్లే భారత రెజ్లర్ల బృందంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న డబ్యూఎఫ్ఐ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టినా.. నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. దీంతో రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పంపే రెజ్లర్ ఎంపిక కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలంటూ సుశీల్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.